16, డిసెంబర్ 2021, గురువారం

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన


మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..!

పంచాయతీ అంటే
◆ గ్రామ సభ
◆ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు
◆ గ్రామపంచాయతీ కో ఆప్టెడ్ సభ్యులు
◆ గ్రామపంచాయతీ శాశ్వత ఆహ్వానితులు
◆ గ్రామ సర్పంచ్
◆ గ్రామ ఉప సర్పంచ్
◆ గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి/గ్రామ పంచాయితీ కార్యదర్శి
◆ గ్రామ రెవిన్యూ అధికారి.
౼౼౼౼౼౼★౼౼౼౼౼౼౼
*◆ గ్రామసభ*
ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహాన్ని గ్రామసభ అంటారు....
గ్రామసభ సభ్యులలో పది శాతం సభ్యులు గాని, యాభై మంది గాని వ్రాతపూర్వకంగా అభ్యర్దించినప్పుడు సర్పంచ్ తప్పని సరిగా గ్రామా సభ ని ఏర్పాటు చేయాలి.
ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం *ప్రతీ సంవత్సరం*
ఏప్రిల్‌ 14
అక్టోబర్‌ 3
జనవరి 2
జూలై 4 తేదీలలో గ్రామ సభ తప్పనిసరిగా నిర్వహించాలి....
౼౼౼౼౼౼°౼౼౼౼౼౼
*◆ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు*
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. వార్డు లా విభజన జనాభాని బట్టి ఈ కింది విధముగా విభజిస్తారు.
300 వరకు జనాభా ఉంటె ఐదు వార్డ్ లు
300 - 500 వరకు 7 వార్డ్ లు
500 - 1500 వరకు 9 వార్డ్ లు
1500 - 3000 వరకు 11 వార్డ్ లు
3000 - 5000 వరకు 13 వార్డ్ లు
ఒకవేళ జనాభా 15000 పైన ఉంటె 19 నుండి 21 వార్డ్ లు గా విభజన ఉంటుంది.
ప్రతి వార్డు నుంచి ఒక సభ్యున్ని రహస్య ఓటింగు పద్ధతి ద్వారా 5 సంవత్సరాలకి ఒకసారి ఎన్నుకుంటారు...
౼౼౼౼౼౼౼°°౼౼౼౼౼౼౼
*◆ గ్రామ సర్పంచ్*
● గ్రామ సర్పంచ్ ని ఓటర్లు 5 సం. లకు ఒకసారి ఓట్లేసి ఎన్నుకుంటారు.
● పోటీకి కనీస వయసు 21 సంవత్సరాలు
● గ్రామసభలను ఏడాదిలో కనీసం రెండు పర్యాయాలు నిర్వహించకపోతే సర్పంచ్‌ తన పదవిని కోల్పోతారు.
●అలాగే ఆ సర్పంచ్ మరో సంవత్సరం పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతాడు.
● గ్రామ పంచాయతీ ఆడిట్‌ పూర్తి చేయనప్పుడు కూడా పదవిని కోల్పోతారు.
౼౼౼౼౼౼°°°౼౼౼౼౼౼
*◆ గ్రామ ఉప సర్పంచ్*
● ఎన్నికల్లో గెలిచినా వార్డు సభ్యులంత కలిసి వారిలో ఒకరిని ఐదేళ్ల వ్యవధికి ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు...
● సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి...
౼౼౼౼౼౼౼°°°°౼౼౼౼౼౼౼
*◆ గ్రామ పంచాయితీ కార్యదర్శి*
●గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికే, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక *#ప్రభుత్వ* ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శి నియమించింది...
౼౼౼౼౼౼°°°°౼౼౼౼౼౼
*◆ గ్రామ పంచాయతీ పరిపాలనా విధులు...*
● 100% పంటల అజమాయిషీ, సర్వే రాళ్ల తనిఖీ చేయాలి...
● వివాహ ధృవీకరణ పత్రం, నివాసం, ఆస్థి విలువ, భూమి హక్కు సర్టిఫికేట్‌ (పహాణీ) జారీ చేయాలి...
● కుల ధృవీకరణ, ఆదాయం, సాల్వెన్సీ సర్టిపికెట్లు ఇచ్చేసమయంలో ప్రాథమిక రిపోర్టు సమర్పించాలి..
గ్రామా పంచాయితీ ఆదాయ మార్గాలు:
పంచాయితీ రాజ్ చట్టం లోని సెక్షన్ 74 ప్రకారం గ్రామ పంచాయితీ కి వచ్చు వివిధ వసూళ్ళని కలిపి గ్రామ పంచాయితీ నిధి అంటారు. ఆ వసూళ్లు కింద పేర్కొన్న విధంగా పంచాయితీ కి సమకూరుతాయి.
●ఇంటిపనులు, మంచినీటి సరఫరా , లైటింగ్, పారిశుద్యం మొదలగు యూసర్ ఛార్జ్ ల తో కూడిన పంచాయితీ సొంత వనరులు.
● స్టాంప్ డ్యూటీ, వినోదపు పన్ని సీనరేజి మేజిస్ట్రయిల్ రుసుముల తో కూడా పంచాయితీ ఆదాయ వనరుల గా సమకూరుతాయి.
● తలసరి గ్రాంట్లు, రాష్ట్ర ఆర్థిక సంఘ గ్రాంట్లు, కేంద్ర ఆర్థిక సంఘ నిధులు సిబ్బంది వేతనాల గ్రాంట్లు సర్పంచు గౌరవ వేతనం ఇతర ప్రోత్సాహక గ్రాంట్లు మరో ప్రధాన ఆర్థిక వనరు.
● అలాగే ప్రజా విరాళాలు పనులకు కాంట్రాక్టర్స్ చెల్లించిన డిపాసిట్లు నీటి పంపు డిపాసిట్లు మొదలగు వాటి ద్వారా కూడా గ్రామా పంచాయితీ వనరులు సమకూరుతాయి.

నెపోటిజం, కంపార్ట్మెంట్ మెంటాలిటీ

 నెపోటిజం , కంపార్ట్మెంట్ మెంటాలిటీ ఈ పదాలు జనాలకి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ మన లైఫ్ లో ఎదో ఒక దశ లో మనకి తెలీకుండానే వీటికి బాదితులం అవుతూనే ఉంటాం. అయినా వీటి గురించి మన పెద్దగా పట్టించుకోము.

నెపోటిజం అంటే అర్హత కల్గిన వారికి దక్కాల్సిన దానిని బంధువులకి రక్త సంబధీకులకి అట్టి పెట్టేసి ఇచ్చేయడం, అర్హతకలిగినా వాడికి మొండి చెయ్యి చూపడమే నెపోటిజం.
ఇకబోతే కంపార్ట్మెంట్ మెంటాలిటీ. దీనిని ఒక కథలా చెప్పుకుందాం. ఒక ట్రైన్ వైజాగ్ నుండి హైదరాబాద్ బయలుదేరింది అనుకుందాం. అనకాపల్లి, తుని, రాజమండ్రి, ఏలూరు దాటి విజయవాడ వచ్చేసరికి జనరల్ కంపార్ట్మెంట్ అంత ఎక్కడ చూసినా జనమే బాత్రూం లలో డోర్ దగ్గర ఇలా కనీసం కాలు కూడా పెట్టలేనంత రష్ గా తయారయింది.
విజయవాడ వచ్చేసరికి నీ బోటి నా బోటి పెద్ద మనిషి ఆదరాబాదరా ప్లాట్ఫారం మీదకి చేరుకొని జనరల్ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడి ఆల్రెడీ ట్రైన్ లో ఉన్నోరు "ప్లేస్ లేదయ్యా" "ఎక్కడ ఎక్కుతావ్" "కాళ్ళు పెట్టుకోవడానికి కూడా స్థలం లేదు" "ఎక్కడ నెత్తి మీద ఎక్కుతావా" అంటూ రకరకాల మాటలు అంటున్న వారిని బతిమాలి చివరికి ఒక కాలి మీద ఫుట్ బోర్డు మీద నుంచొని అయినా సరే ట్రైన్ ఎక్కి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటావ్. ట్రైన్ బయలుదేరిన కాసేపటికి జనాలు అటు ఇటు సర్దుకొనేసరికి ఆ పెద్ద మనిషి కి కాస్త రెండు కాళ్ళు పెట్టుకొని సౌకర్యవంతంగా నిల్చునే స్థలం దొరికేసింది. ప్రయాణం స్టార్ట్ అయింది.
ఈసారి ట్రైన్ గుంటూరు చేరింది ఈలోపే ఇంకో పెద్ద మనిషి అదే ట్రైన్ ఎక్కబోతాడు ఈసారి అందరి కంటే ముందు ఆ పెద్ద మనిషి ని అడ్డుకునేది కంపార్ట్మెంట్ లో ప్లేస్ లేదు అని అడ్డం పడేది ఇంతకుముందు బెజవాడ లో ఆపసోపాలు పడి బతిమాలి బామాలి ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కినా వ్యక్తే. అరగంట క్రితం తాను ఏ పోసిషన్ లో ఉన్నాడో అనే విషయాన్నీ మర్చిపోయి తనలాగే ఉన్న ఇంకో వ్యక్తి కి అడ్డం పడతాడు. అదే కంపార్ట్మెంట్ మెంటాలిటీ.
మనలో చాలామంది మనకి తెలీకుండానే దీనికి బాధితులు అవ్వడమే లేక మనమే కారకులు అవ్వడమే చేస్తూ ఉంటాం. ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ. . ప్రయాణం చేసే చోట పని చేసే ఆఫీస్ లో సినిమా ఇండస్ట్రీ లో వ్యాపారం లో రాజకీయాల్లో ఇలా ఇది ప్రతి చోట ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ లో ఇది మరి ఎక్కువ.
ముప్పై ఏళ్ల క్రితం ఒక్క ఛాన్స్ అంటూ డైరెక్టర్ లు ప్రొడ్యూసర్ లా కార్ల వెనకాల పరిగెత్తి వాళ్ళ చేత అడ్డమైన తిట్లు తిని చోట మోట క్యారెక్టర్ లు సంపాదించి ఎండలో ఎండి ఒక్కో మెట్టు ఎక్కి ఇవాళ "మెగా" స్టార్ లు అయినా వారు కూడా కంపార్ట్మెంట్ మెంటాలిటీ బాధితులే. అలా ఎదిగిన వారే కొత్తవారికి , వర్ధమాన నటులకి అడ్డు గోడలు గా తయారవుతారు. అలా తయారయ్యి ఒక ఉదయ్ కిరణ్, ఒక సుశాంత్ సింగ్ రాజపుట్ లాంటి వారి ఆత్మహత్యలకి కారకులు అవుతారు.
ఇలాంటి కంపార్ట్మెంట్ మెంటాలిటీ ని ఎక్కడున్నా కూడా ఉపేక్షించకూడదు. అది కంటికి కనిపించని చాల పెద్ద సైకలాజికల్ డిసార్డర్. (సశేషం)

10, ఏప్రిల్ 2021, శనివారం

ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారి 100వ జయంతి సందర్భంగా వారి ని స్మరించుకుంటూ నా అక్షర నివాళులు

 


ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహామనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురము మండలం పెదపట్నం లో 1921, జూలై 28 న చిట్టూరి జమీందారీ వంశములో, ముళ్ళపూడి తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు జన్మించాడు.  తెలుగు నాట మొదటి తరం పారిశ్రామిక వేత్త లు గా పేరెన్నికగన్న  KCP గ్రూప్ వెలగపూడి రామ కృష్ణ గారు, ఆంధ్ర బిర్లా గా పిలవబడే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు,  శ్రీరామ్ దాస్ మోటార్స్  కంటిపూడి చౌదరి గారు ప్రముఖులు. 

పాఠశాల విద్య (ఎస్ ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద గారు దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించారు, అంచలంచెలుగా విస్తరింపబడిన ఈ పరిశ్రమ ఒరవడి కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరీన్, హైడ్రోజెన్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, సూపర్ ఫాస్ఫేట్, రాకెట్ ఇంధనము మొదలగు ఉత్పత్తులకు దారి తీసింది. గుంటూరులో నూనెలు, హైడ్రాజినేటెడ్ నూనెలు తయారీ. #తాడువాయి_భీమడోలు_కొవ్వూరు_సగ్గొండ లలో వివిధ #కర్మాగారాలు.

ఉమ్మడి ఆంధ్ర లో  పారిశ్రామిక రంగానికి ఆద్యుడు.

గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.

గత 74 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదు.

12,000 ఉద్యోగులు.

1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడి తో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది.

రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ.

దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.

ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.

భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.

మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర షుగర్స్ సముదాయము

ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రా పెట్రో కెమికల్స్, విశాఖపట్నం.

మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర కెమికల్స్ కార్పొరేషన్

హిందూస్తాన్ ఎలైడ్ కెమికల్స్

డైరెక్టర్, ఎమ్ ఎ ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ, వల్లభనగర్, గుజరాత్

డైరెక్టర్, ఆంధ్రా ఫౌండ్రీ మరియు మెషీన్స్, హైదరాబాదు

ఛైర్మన్, జోసిల్ లిమిటెడ్, డోకిపర్రు.

ఛైర్మన్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.

జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్, వెంకటరాయపురం.

ఛైర్మన్, శ్రీ అక్కమాంబ టెక్స్ టైల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.

ఆంధ్రా ఫారం కెమికల్స్ కార్పొరెషన్ లిమిటెడ్, కొవ్వూరు.

కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడు కలిస్తే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌. తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెదపట్నం గ్రామంలో జన్మించిన ఆయన తణుకులో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు. 24 ఏళ్ల వయసులో 1947 ఆగస్టులో తణుకులో ఆంధ్రా షుగర్స్‌ పరిశ్రమను స్థాపించారు. అప్పట్లో జనసంచారంలేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకు 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6 వేల టన్నులకు చేరేలా కృషి చేశారు. ప్రారంభంలో 350 మందితో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్‌ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింతగా సాగుతోంది. ఆ తర్వాత కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును 1960లో స్థాపించారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను 1960లో స్థాపించారు. 1984లో తణుకులోనే ర్యాకెట్‌ ఇంధన ప్లాంటును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తవుడు ముడిపదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనేట్‌ అయిల్స్‌ తయారుచేసే ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1995 ,96 సంవత్సరాల్లో టాటా లని బిర్లాలని అంబానీలని మించి  దేశం లోనే  highest  payer  గా నిలిచారు.    ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పని చేస్తూ వచ్చారు. హరిశ్చంద్రప్రసాద్‌ ఏక సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంఘాలల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.


పారిశ్రామిక దిగ్గజంగా పేరుగాంచిన ముళ్లపూడి రాజకీయాల్లోనూ సేవలందించారు. మొదట్లో కాంగ్రెస్‌వాదిగా పేరొందిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1955-67లో మధ్య రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తణుకు గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన ఆయన 1981లో తణుకు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత తొలి మున్సిపల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతర కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ గారు కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.

తణుకు గ్రామ పంచాయతీ సర్పంచ్

తణుకు మునిసిపల్ ఛైర్మన్

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు

అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాప్సీ.

ఛైర్మన్, నబార్డ్ అగ్రి బిజినెస్

ఉత్తమ యాజమాన్య అవార్డ్ - 1973.

చక్కెర కళాప్రపూర్ణ, అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రము - 1981.

ఉత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డ్ - 1985.

ఇంధన పొదుపులో జాతీయ అవార్డ్ - 1991.

ఉత్తమ మార్కెటింగ్ కంపెనీ అవార్డ్ - 1992.

ప్రశంసా పత్రము, ఇస్రో

వృక్షమిత్ర పురస్కారము

హైదరాబాదు మేనేజ్ మెంట్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారము

నాగార్జున విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్.

ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయము

విజయవాడ తపోవనం.

శ్రీ సీతారామస్వామి ధ్యాన మందిరం, జూబిలీ హిల్స్

హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, నరసాపూర్

ప్రేమ సమాజం, విశాఖపట్నం.

ముళ్ళపూడి వెంకటరమణమ్మ స్మారక వైద్యశాల, తణుకు.

కంటి వైద్యశాల, తణుకు

రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ.

ఇలాంటి ఘన కీర్తి ఉన్న గొప్ప వారిని స్మరించడం మన అదృష్టం...!!

8, ఏప్రిల్ 2021, గురువారం

70 వ దశకం నుండి 1983 వరకూ తెలుగు మీడియా - రాజకీయ ప్రభావం - కారణాలు, నిజాలు

 పచ్చ మీడియా అనే ఒక పదం ఈ మధ్య ఒక రెండు దశాబ్దాల కాలం లో తెలుగు రాష్ట్రాల్లో  వాడబడుతున్న ఒక పదం. దీని పూర్వాపరాల లోకి వెళ్లి చూస్తే..అసలు ఆంగ్లం  లో ఈ పదాన్ని ఎవరికోసం ఉద్దేశించి కనిపెట్టారో వాళ్ళే దీన్ని వాడటం ఇక్కడ మహా వెటకారం.

చంద్రబాబు గారు  గోబెల్స్ అని, పచ్చ మీడియా ద్వారా రెండు రాష్ట్రాలను కంట్రోల్ చేసేస్తున్నాడు అని మొదలు పెట్టిన్న ఈ ప్రచారం ఇప్పుడు శ్రుతి మించి వెర్రి తలలు వేస్తుంది.నిజానిజాలు చెప్పే ఓపిక తెలిసిన వారికి లేక.. తెల్సుకునే తీరిక  ఇప్పటి జనం కి లేక జనాలు ఈ వారు విసిరినా మూఢత్వం లో కొట్టుకుపోతున్నారు. 

అసలు తెలుగుదేశం పుట్టే నాటికి వున్న ప్రధాన పత్రికలు తీసుకుంటే ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, విశాలాంధ్ర, ప్రజా శక్తి ప్రధాన మైన్ స్ట్రీమ్ పత్రికలు.  పైన చెప్పిన దిన పత్రికల్లో అప్పటికే ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి కాంగ్రెస్ ఏంపి లవి అందులో ఒకటి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి ధీ. ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ రామనాథ గోయెంక ది. ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరావు గారిది, ఆయన చనిపోయాక ఆయన అల్లుడు, కాంగ్రెస్ ఎంపీ  శివలెంక శంబు ప్రసాద్ ఆయన తర్వాత ఆయన వారసులు నడిపారు. సో ..అరవై లకే అప్పటి హై యస్ట్ సర్క్యులేట్ డ్ ఆంధ్ర పత్రిక కాంగ్రెస్ వారిది. ఈ ప్రధాన పత్రికలు కాక ఇంకో డజన్ చిన్న చితక దిన పత్రికలు గా చెప్ప బడేవి వుండేవి

సితార, జ్యోతి చిత్ర ప్రధాన సినిమా పత్రికలు. సితార ఈనాడు ది అయితే, జ్యోతి చిత్ర ఆంధ్ర జ్యోతి ది. జ్యోతి చిత్ర టాప్ సినిమా పత్రిక. ఆంధ్ర జ్యోతి కి బాల జ్యోతి అనే పిల్లల పత్రిక కూడా వుండేది. బాగా నడిచేది. ఇవి కాక వీక్లీ ల హవా నడుస్తున్న ఆ కాలం లో  ఆంధ్ర జ్యోతి, ప్రభ, పత్రిక, భూమి కి వీక్లీ మాగజిన్ లు అదనం గా వుండేవి. 

ఈనాడు వచ్చేనాటికి ఆంధ్ర ప్రభ ఎంట్రీ తో మద్రాస్ ప్రధాన కేంద్రం గా పబ్లిష్ అయే ఆంధ్ర పత్రిక దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితి . అప్పటికే కాంగ్రెస్ భజన పత్రికలను జనాలు ఆదరించడం తగ్గిపోయింది అనే దానికి ఆంధ్ర ప్రభ లభించిన ఆదరణే సాక్షం. తర్వాత  ఈనాడు ఎంట్రీ తో అప్పటి వరకు మూస లో సాగుతున్న దిన పత్రిక పద్దత్తు ల్లో పెను మార్పులు రావడం వల్ల ప్రజలు విపరీతం గా ఆదరించారు. 1974 కి 20 వేల ముద్రణ కెపాసిటీ తో మొదలు అయ్యిన ఈనాడు ప్రస్థానం 1979 కి ఒక లక్షా ఏనబై  వేల కి చేరింది. తెలంగాణ ఉద్యమం , విశాఖ ఉక్కు, జై ఆంధ్ర ఉద్యమాలు, ఎమర్జెన్సీ అనంతరం ప్రజల్లో పెరిగిన రాజకీయ చైతన్యం కూడా తెలుగునాట పత్రికా  పఠనం పట్ల జనం లో ఆసక్తి ని పెంచటం లో దోహద పడింది.  ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం లో పెరుగుదల కేవలం 6 శాతం మాత్రమే నమోదు అయ్యిన ఈ కాలం లో దిన పత్రికల పాఠకుల సంఖ్య 70 శాతం పెరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే, రొటీన్ రొట్ట కొట్టుడు తరహా నుంచి నవలా ప్రపంచం లో  ఒక యండమూరి కలిగించిన విముక్తి లాంటి దే ఈనాడు క్రియేట్ చేసింది కూడా. 

ఇలాంటి సమయంలో ప్రతి ఐదు ఏళ్ళకి సర్క్యులేషన్ రెట్టింపు అవుతూ, వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసుకుంటున్న ఏ ఒత్సాహిక వ్యాపార వేత్త కూడా కుల పిచ్చి తో నో మరొక పిచ్చి తో నో అప్పుడే పుట్టిన తెలుగుదేశం కి అండ గా నిలబడే వెర్రి సాహసం చేయడు. పైగా కేంద్రం లో కక్షపూరిత మనస్త్వత్వం గల  ఇందిర గాంధీ  సంగతి, కాంగ్రెస్ సంగతి తెలిసి కూడా. కానీ రామోజీ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్  తీసుకున్నాడు అంటే జనం లో వున్న కాంగ్రెస్ వ్యతిరేకత కు భిన్నంగా వెళ్లి  వ్యక్తిగత ఇమేజ్ క్రెడి బిలిటీ దెబ్బ  తీసుకుంటే  వ్యాపారం కూడా దెబ్బ అవుతుంది అని లెక్క వుంది కాబట్టే రామోజీ అప్పటి ప్రజా నిర్ణయం బట్టి కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు అనేది స్పష్టం. (తర్వాత కాలం లో కూడా జనం లో ఆదరణ వస్తుంది అనుకున్న ప్రతి సారి NTR గారి మీద కూడా  ఏడా పెడ కార్టూన్ లు కామెడీ లు వదిలిన చరిత్ర ఈనాడు కి వుంది, ఆ విషయం ముందు ముందు మాట్లాడుకుందాం) 

1983 చివరికి వచ్చేసరికి ఈనాడు పాఠకులు రెట్టింపు అయ్యారు , 1979 లో లక్షా ఏనాబై వేలు నుంచి 3 లక్షల 47 వెలు అయ్యింది. అలాగే మిగతా కొన్ని పత్రికలు కూడా కాంగ్రెస్ ఎంపి కేఎల్ ఏన్ ప్రసాద్ గారి ఆంధ్ర జ్యోతి సర్క్యులేషన్ 25 వేల నుండి 67 వెలు కి పెరిగింది 1983 కి . తిక్కవరపు చంద్ర శేఖర్ రెడ్డి నడిపే   ఆంధ్ర భూమి లాంటి పరమ కాంగ్రెస్ భక్తి పత్రిక ల ను మాత్రం ఎంతో అభిమానం ప్రేమ తో గజ్జెల మల్లారెడ్డి లాంటి వాళ్ళు వెళ్లి మరీ కృషి చేసినా  కూడా సర్క్యులేషన్ డ్రాప్ ని ఆపలేక పోయారు. 

ఇవి కాక ఇహ మిగిలింది విశాలాంధ్ర, ప్రజాశక్తి..ఇవి రెండు తెలుగు దేశం పార్టీ తో 1983 ఎలక్షన్ ల లో ప్రత్యర్థులు గా పోటీ చేసిన కమ్యునిస్ట్ పార్టీ లవి. సో.. తెలుగుదేశం కి అవి సపోర్ట్ చేసే పరిస్తితి లేదు. అలా అడ్డం గా ఒక పార్టీ ని సపోర్ట్ చేసినా వ్యతిరేకించినా ఆ పత్రికలు పెద్దగా నిలబడని కాలం అది. ఏక పక్షంగా కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి తో పోయిన గోయెంక ఆంధ్ర ప్రభ ని కూడా జనం ఆదరించడం మానేస్తున్న ఆ టైమ్ లో..కొంత వరకూ న్యూట్రల్ గా ఉండటానికి ప్రయత్నం చేసిన ఆంధ్ర జ్యోతి కి కాంగ్రెస్ ఎంపి పత్రిక అయ్యినా ఆదరణ లభించింది.( ఆ తర్వాత కాలం లో ఆ ధోరణి కి దూరం జరిగాక ఆంధ్ర జ్యోతి కనుమరుగు అయ్యింది).

ఇప్పుడు ఇక్కడ చూస్తే 1982-83 తెలుగు దేశ ప్రభంజనం లో తెలుగుదేశం కి పరోక్షం గా సహకరించింది ఒక పత్రిక అనుకుంటే..కాంగ్రెస్ కి డైరెక్ట్ గా సహకారం అందించినవి ఎన్నో చూస్తే వాస్తవం అర్దం అవుతుంది. 

 ఆ రోజుల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ ఏంపి లు నడుపుతున్న పత్రికలు, ఇన్ డైరెక్ట్ గా ఆ పత్రిక లను అడ్డు పెట్టుకొని చిన్నా చితకా ముద్రాలయలను, జర్నలిస్ట్ లను రచయతలను ఎలా లోబర్చుకొని రాశారో,రాయించారో కొంచం వెనక్కి వెళ్లి చూడక్క ర్లేదు..ఇప్పుడు నడుస్తున్న చరిత్ర సాక్షి గా చూస్తే అర్ధం అవుతుంది. 

ఇక్కడ పచ్చ పత్రిక"లు" అనడానికి, "లు* కూడా లేవు,కాస్తో కూస్తో అండగా వున్నది ఒకటే పత్రిక, అలా వుండటానికి  దాని కారణాలు దానికి వున్నాయి.  అవి వదిలి పచ్చ పత్రికలు పచ్చ పత్రికలు అంటూ పదే పదే పాడి జనం నీ   వెర్రి బోగుల వాల్లన్ని చేస్తూ లోపల  నవ్వుకుంటున్న ప్రాపగాండా మేకానిజం ని నిలదీసే సమయం వచ్చింది.

27, మార్చి 2021, శనివారం

ఎన్ని తరాలకి రిజర్వేషన్స్ పొడిగిస్తారు అనే సుప్రీం కోర్ట్ వ్యాఖ్యల పై నా అభిప్రాయం

 రిజర్వేషన్స్ అనేది నిజంగానే చాలా సింపుల్. 

నిజానికి 'రిజర్వేషన్' అనే పేరుతో గాకపోయినా ఈ రిజర్వేషన్ లు అన్ని దేశాల్లోనూ రకరకాల రూపాల్లో ఉంటాయి. 

ఉదాహరణకి అమెరికాలో  ' ఫస్ట్ జెనరేషన్ కాలేజ్ స్టూడెంట్ ' అనే కేటగిరీ ఉంది. ముందు తరంలో ఎవరూ గ్రాడ్యుయేట్ కాకపోతే వాడికి ఈజీగా సీట్ ఇస్తారు, స్కాలర్ షిప్ ఇస్తారు. సపోర్ట్ చేసినందుకు ఆ కాలేజ్ కి రకరకాల ప్రయివేట్ సంస్థలూ, ప్రభుత్వ సంస్థలూ నిధులు సమకూర్చుతారు. ఇది 'తరం' కి సంబంధించింది. వర్గానికో, వర్ణానికో, జాతికో సంబంధించినది కాదు. అదే తరానికి చెందిన అందరు తోబుట్టువులకీ వర్తిస్తుంది. 

దీన్నే మన దేశానికి తగినట్టుగా 'కుటుంబంలో తొలి తరం ఇంజనీర్ ' , ' కుటుంబంలో తొలి  తరం డాక్టర్ ',  ' కుటుంబంలో తొలి తరం సివిల్ సర్వెంట్' , ' కుటుంబంలో  తొలి తరం ప్రజా ప్రతినిధి ' అనే రిజర్వేషన్లు ప్రవేశ పెట్టొచ్చు. కులం సంగతి ఎక్కడా ప్రస్తావించాల్సిన అవసరం లేదు.   ఈ రిజర్వేషన్ అందుకునే వారిలో ఎలాగూ యాభై శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ , బి సి లు ఉంటారు. కానీ ఆ కేటగిరీలో వచ్చినందుకు తక్కువగా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంకా గర్వంగా ఉంటుంది. కుటుంబంలో తొలితరం హీరోగా.  

దీనివల్ల ఆటోమేటిక్ గా -  అతి దీనంగా బతికే తక్కువ శాతం ఓసీలకి కూడా చోటు దొరకడమే కాకుండా అతి విలాసంగా బతుకుతూ రిజర్వేషన్ లకి ఎగబడే  తక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ లు కూడా ఎలిమినేట్ అయిపోతారు. 

వెరిఫై చెయ్యడం చాలా తేలిక, అవసరమైన వాళ్ళకే దక్కుతుంది, అనవసరమైన వాళ్ళని ఆపెయ్యడం తేలిక, కులం అనే ప్రసక్తే ఎక్కడా ఉండదు. కులం పేరిట జనాన్ని విభజిస్తూనే కులాన్ని రూపుమాపాలనే ద్వంద ప్రమాణాల్ని సమాజంనుంచి పారద్రోలవచ్చు.

***

20, జనవరి 2021, బుధవారం

కాంగ్రెస్ పార్టీ చరిత్ర - YSR పార్టీ ఫిరాయింపు కథ


భారత దేశం కి బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చి 1950 లొ భారత రాజ్యాంగం అమలు లొకి వచ్చింది. ఆ ఏడాదే జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటి ఎన్నికలు 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి.

జవహర్ లాల్ నెహ్రు సారధ్యనా కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల కమిసన్ "కాడెద్దుల" గుర్తు కేటాయించింది.  ఈ ఎన్నికల గుర్తు తొ మొట్టమొదట కాంగ్రెస్ పార్టి ఎన్నికలకి వెళ్ళి విజయం సాదించింది. 1951 నుండి  1971 వరకు వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ కాడెద్దుల గుర్తు మీద పోటీ చేసింది. 


1966 జనవరి లొ ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహ్దూర్ శాస్త్రి గారి మరణం తొ గుల్జారిలాల్ నందా గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చెసి 13 రొజులకి పార్టి నాయకుని ఎన్నుకునే సమయం లొ ఇందిరా గాంధి గారికి మొరార్జి దేశాయి రూపం లొ గట్టి  పొటి ఏదురైంది.

 కానీ మొరార్జీ దేశాయ్ గారి కోరిక మేరకు జరిగిన సీక్రెట్ ఓటింగ్ లో  నెహ్రూ హయాము తరువాత సిండికేట్ గా పేరు గాంచిన కామ్రాజ్ నాడర్, నిజ లింగప్ప, నీలం సంజీవ రెడ్డి  లాంటి కొంతమంది వ్యక్తుల సహాయము తొ   ఇందిరా  గాంది విజయం సాదించారు. 1966 జనవరి 19న జరిగిన ఆ ఎన్నికలొ మొరార్జీ కి 169 ఒట్లు , ఇందిరా గాంధి కి 355 రాగా ఇందిరా మొరార్జి మీద 186 ఒట్ల తేడా తొ గెలిచి ప్రధానమంత్రి అయ్యారు.

ఈ సిండికేట్ పేరుతొ కాంగ్రెస్ లొ కొంతమంది కుర్చి లొ ఎవరు కూర్చున్న వారు ఆ కుర్చీని నడిపేవారి గా తయ్యారు అయ్యారు. ఇందిరా వారు ప్రధాని గా కుర్చోపెట్టడానికి కారణం కూడా ఇదే ఆవిడా వెనకాల ఒక అదృశ్య శక్తీ లా రాజకీయాలు ప్రభావితం చెయ్యాలనే దురాలోచనే. ఇందిరా ప్రధాని గా ఎన్నికయ్యాక కొన్ని నెలల కె  తన స్వంత నిర్ణయాలు తో సిండికేట్ ఆలోచనల ని తలకిందులు చేసారు. దానితో ఇందిరా గాంధీ కి సిండికేట్ కి క్రమంగా విబేధాలు పొడచూపాయి. 


1969 నాటికి అవి తారాస్థాయికి చేరాయి.అదే ఏడాది 14 బ్యాంకు లని ఇందిరా గాంధీ జాతీయం చేసారు. ఈ నిర్ణయం తో ప్రజల్లో హర్షాతిరేకాలు కల్గిన సిండికేట్ లో ఒకరైన మొరార్జీ గారికి ఈ నిర్ణయం మింగుడు పడలేదు. వెంటనే తన ఆర్థిక మంత్రి పదవి కి రాజీనామా చేసారు. 

ఇలా జరుగుతున్న సమయం లొ రాష్ట్రపతి గా ఉన్న జాకీర్ హుస్సేన్ మరణం తొ రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ  రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నీలం సంజీవ్ రెడ్డి ని పోటీ కి నిలిపారు. ఇందిరా గాంధీ సంజీవ రెడ్డి కి వ్యతిరేకంగా అప్పటి ఉప రాష్ట్రపతి వి వి గిరి అనే మరో తెలుగు వాడిని  ఇండిపెండెంట్ రాష్ట్రపతి అభ్యర్థి గా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ప్రధాని  ఇందిరా అంతరాత్మ ప్రభోదానుసారంగా  గా ఓటు వేయమని తమ నాయకులకి  పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి అయిన సంజీవరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అయిన వివి గిరి second preference votes తో అతి తక్కువ మెజారిటీ తో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించారు. దీనితో సిండికేట్ కి ఇందిరా కి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా నిజ లింగప్ప ఉండేవారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డి ఓడిపోయినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసారు అనే సాకు తో  ప్రధాని గా ఉన్న  ఇందిరా ను నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు.


ఈ బహిష్కరణ తో కాంగ్రెస్ రెండు ముక్కలు అయింది. కామరాజ్, మొరార్జీ దేశాయ్ లాంటి సిండికేట్ల  అద్వర్యం లొ తమదే నిజమైన కాంగ్రెస్ అని, ఆ కాంగ్రెస్ కి ( కాంగ్రెస్ ఒ ) (కాంగ్రెస్ ఆర్గనైజేషన్) గా పిలుచుకున్నారు, బహిష్కరంప బడిన ఇందిరా తమ వర్గం తొ (కాంగ్రెస్ ఆర్) (కాంగ్రెస్ రెక్వజెషన్) గా పిలుచుకున్నారు 1971 ఎన్నికలలొ(కాంగ్రెస్ ఒ) తమ పాత కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన "కాడెద్దులు" గుర్తు  తొ రాగా , (కాంగ్రెస్ ఆర్) కి ఎన్నికల సంఘం "ఆవు దూడా" గుర్తు ఇచ్చింది.


"ఆవు దూడా" ఎన్నికల గుర్తు తొ ఏ పొత్తులు లేకుండా 1971 ఎన్నికలకి వెళ్ళగా , (కాంగ్రెస్ ఒ) మాత్రం భారతీయ జనసంఘ్ , స్వతంత్రపార్టి, సమ్యుక్త సొషలిస్ట్ పార్టి, ప్రజా సొషలిస్ట్ పార్టిలతొ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది , ఈ ఎన్నికలలొ కాంగ్రెస్ ఒ చిత్తుగా ఒడిపొయి కెవలం 518 సీట్లకి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంటే , ఇందిరా గాంధి "కాంగ్రెస్ (ఆర్)" పార్టి మాత్రం గరీభి హటావొ ( పేదరిక నిర్మూలన ) నినాదం తొ ప్రజలలొకి వెళ్ళి వారి మనస్సు గెలుచుకుని 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ని ఏర్పారు చెసింది. ఈ గెలుపుతొ ఎన్నికల సంఘం ఇందిరా గాంధి గారి కాంగ్రెస్ పార్టి ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తించింది. కొత్త కాంగ్రెస్ కి అద్యక్షులు గా జగ్ జీవన్ రాం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 

ఆ ఎన్నికల్లో విజయం సాదించినా ఇందిరా 1971 లో జరిగిన పాకిస్థాన్ తో యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పాటు లాంటి వాటిని ఆవిడ కీర్తి అమాంతం పెరిగింది. కానీ రాయ్ బరేలి నుండి ఆవిడ మీద లోక్సభ ఎన్నికల్లో  పోటీ చేసి ఓడినా గురు రాజ్ నారాయణ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కోర్ట్ కి వెళ్లారు. నాలుగేళ్లు నడిచిన ఈ కేసు లో ఇందిర గాంధీ మీద మోపిన అభియోగాలు నిజమని తేలడం తో అలహాబాద్ కోర్ట్ 1975 నా ఆవిడ ఎన్నిక చెల్లదని అలాగే ఆవిడ మరో ఆరేళ్ళ  పాటు టు పోటీ చేసే అర్హత లేదని తీర్పు ఇచ్చింది. 

వెంటనే ఇందిరా గాంధీ కొడుకు సంజయ్ గాంధీ మరి కొందరు కాంగ్రెస్ నాయకుల సలహా మేరకు 1975 జూన్ 15 నా ఎమర్జెన్సీ విధించారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు రెండేళ్లు నడిచి 1977 నా ముగిసింది. ఈ ఎమర్జెన్సీ ప్రభావం తో ఇందిరా ప్రభ కి మసకబారింది. ప్రజల్లో కోపావేశాలు పెల్లుబికాయి. 

దానిఫలితమే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘోర పరాజయం ఎదురైంది. ఇందిరా  స్వయంగా  పోటీ  చేసినా  ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి  ఓడిపోయారు.ఆవిడా కుమారుడు సంజయ్ గాంధీ కూడా పరాజయం చవి చూసారు. 1977ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఎదురుగాలి వీచిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మాత్రం  పట్టంగట్టారు. 42 పార్లమెంట్ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క నంద్యాలలో మాత్రం ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. ఇక్కడి నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి గెలిచారు. 

1977 మే 6 నా  లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరా అనూయుడు, ఎమర్జెన్సి పెట్టమని సలహా ఇచ్చిన సిద్దార్ధ శంకర్ రాయ్ మీద గెలిచి  పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఇండియా అంటే ఇందిరా అన్న కాంగ్రేసు నేతలే ఓటమి తరువాత ఇందిరాను అనేక విధాలుగా అవమానించారు.

 ఎమర్జెన్సి సమయంలో వివిద కంపెనీలకు చెందిన 104 జీపులను అక్రమంగా వాడుకున్నారన్న అభియోగంపై 1977 మే నెలలో CBI ఇందిరాను అరెస్టు చేసింది. ఈ అరెస్టుతో ఎమర్జెన్సి సమయంలో జరిగిన అణిచివేత,దౌర్జన్యాల వలన ఇందిరా మీద ప్రజల్లొ ఏర్పడ్డ వ్యతిరేకత,కోపం తగ్గిపోయి ఇందిరా మీద ప్రజల్లొ సానుభూతి పెల్లుబికింది.

ఇందిరా కాంగ్రెస్  మీద పట్టు కోసం చేసిన ప్రయత్నాలు సఫలంకాకపోవటంతో బెదిరింపు ధోరణిలో 1977 డిసెంబర్ 18న ఇందిరా & ఆమె వర్గం కాంగ్రేస్ కార్యవర్గానికి రాజినామ చేశారు. బ్రహ్మానందరెడ్డి వర్గం పట్టించుకోకపోవటంతో 1978 జనవరి మొదటి వారం లో  ఇందిరా వర్గం సమావేశం నిర్వహించి ఇందిరాను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.అదే వారం లో అప్పటి AICC ప్రెసిడెంట్  బ్రహ్మానందరెడ్డి ఇందిరాను,ఆమె వర్గాన్ని పార్టి నుంచి బహిష్కరించారు

1978లో కాంగ్రెస్ మరోసారి  రెండుగా చీలింది. ఇందిరా జనవరి 10-12 మధ్య సొంత పార్టి కాంగ్రేస్(I) స్థాపించారు. కాంగ్రేసు ఎన్నికల గుర్తు ఆవు-దూడ బ్రహ్మానందరెడ్డి వర్గానికి ఎన్నికల కమీషన్ కేటాయించింది.ఈనిర్ణయాన్ని సవాలు చేస్తు ఇందిరా సుప్రిం కోర్టుకు వెళ్ళగా ఎన్నికల కమీషన్ విధుల్లొ కల్పించుకోమని ప్రకటించి కోర్టు కేసు కొట్టేసింది.

మరో వైపు ఎన్నికల కమీషన్ 1978 జనవరి 13న ఆంద్రప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలకి ఫిబ్రవరి 24న ఎన్నికలు జరుగుతాయి అని నొటిఫికేషన్ విడుదల చెసింది. 

దీంతొ  తమ పార్టి ని కాంగ్రెస్ (ఐ) గా వ్యవహరించాలి అని నిర్నయం తీసుకున్నారు, రాన్నున్న ఎన్నికలలొ గుర్తు కొసం తీవ్ర ఆలొచన చెసిన ఇందిర వర్గం, హస్తం గుర్తు కేటాయించాలి అని ఎన్నికల కమీషన్ ని అభ్యర్ధించగా ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ ఐ ( ఇందిరా కాంగ్రెస్ కి ) "హస్తం" గుర్తు కేటాయిస్తు 1978 ఫిబ్రవరి 2వ తారికున ప్రకటించారు.


ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకి వస్తే బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ (కాంగ్రెస్ ఆర్) లో పెద్ద నాయకులూ గా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు,NG రంగా, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, బొడ్డేపల్లి రాజగోపాలరావు,బత్తిన సుబ్బారావ్ ,మండలి కృష్ణారావు, పిన్నమనేని కోటేశ్వర రావు ,రోశయ్య లాంటి పెద్ద స్థాయి నేతలు, మంత్రులు గా చేసిన వారు ఉండిపోయారు. 

జనతా పార్టీ తరపున గెల్చినా ఏకైక నేత నీలం సంజీవ రెడ్డి తో పాటు గా  తెన్నేటి విశ్వనాధం ,గౌతు లచ్చన్న , బాబుల్ రెడ్డి , పిడతల రంగారెడ్డి,ఆనం కుటుంబం,రెడ్డివారి రాజ గోపాల్రెడ్డి, జైపాల్ రెడ్డి, P.రామచంద్రారెడ్డి,జవ్వాది చొక్కా రావ్ లాంటి నాయకులూ చేరారు. 

ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)  తరుపున  T.అంజయ్య,జి రాజారామ్ ,బాగారెడ్డి,పాగా పుల్లారెడ్డి లాంటి వారు తెలంగాణాలోను  చింతలపాటి  మూర్తిరాజు, వైరిచెర్ల చంద్ర చూడామణి,వాసిరెడ్డి కృష్ణ మూర్తినాయుడు, ఆళ్వార్ దాస్,కోనా ప్రభాకర రావ్,కొనేరు రంగా రావ్,కాకాని వెంకట రత్నం కుటుంబం,దివి కొండయ్య చౌదరి, కందుల ఓబుల్ రెడ్డి,నల్లారి అమర్నాథ్ రెడ్డి ,పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, K.E. మాదన్న,పాటూరి రాజగోపాల్ నాయుడు  లాంటి వారు కోస్తా, రాయలసీమలో ఇందిరా కాంగ్రేసు తరుపున నిలిచారు.

ఇందిరా కాంగ్రేసుకు చుక్కాని లేదు.ఈపరిస్థితులో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా ఉన్న మర్రి చెన్నారెడ్డి రాజినామా చేసి 18-Jan-1978న ఇందిరా కాంగ్రేసు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి స్వీకరించారు. MPగా ఉన్న P.V.నరసింహారావ్ డిల్లీలో ఇందిరాకు సహాయంగా ఉన్నారు.

పార్టీ పెట్టిన నెల రోజులల్లో ఎన్నికలు రావడం తో  ఇందిర కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అయింది. పార్టీ గుర్తు కూడా కొత్తది అవడం పార్టీ తరపున నేతలు బలమైన నేతలు కూడా పెద్ద గా లేకపోవడం లాంటివి సమస్యలు గా మారాయి. ఇందిరా కాంగ్రేసుకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి.ఎన్నికల డిపాజిట్ 500 రూపాయలు కట్టగలిగే చదువుకున్న యువకులకు పెద్దేత్తున టికెట్లు ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి కాంగ్రేస్ గెలుస్తుందని అంచనా..

మన రాష్టం లో రెండు కాంగ్రెస్ లు పోటీ లో ఉండటం చేత కాసు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ ని "రెడ్డి" కాంగ్రెస్ గాను ఇందిరా నేతృత్వాన నడిచే కాంగ్రెస్ ని "ఇందిరా" కాంగ్రెస్ గాను పత్రికలూ సంబోదించాయి. 


ప్రతి కాలేజీ కి ఒక గోల్డెన్ బ్యాచ్ ఉన్నట్లు ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గోల్డెన్ బ్యాచ్. 1978లో జరిగిన రాజకీయ పరిణామాల్లో భవిషత్తు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాజకీయ జీవితం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుగురు ముఖ్యమంత్రుల రాజకీయ జీవితం 1978లోనే మొదలైంది.

ఈ పోస్ట్ లో వారందరిని కవర్ చేయలేకపోవచ్చు గాని కొందరి పేర్లు  ఉదహరిస్తాను.వారిలో  నారా చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి, ముప్పవరపు వెంకయ్య నాయుడు, PJR , KE కృష్ణమూర్తి, కరణం బలరాం లాంటి వారు ప్రముఖులు. 

ఈ ఎన్నికల్లో చంద్రగిరికే చెందిన, ఇందిరా కాంగ్రేస్ నాయకుడు P.రాజగోపాల్ నాయుడు(గల్లా అరుణ తండ్రి) గారు చిత్తూరు MPగా ఉన్నారు. రాజగోపాల్ నాయుడు చదువుకున్న యువకులను పోటికి దించాలని చేసిన అన్వెషణలో చంద్రబాబు దొరికారు.చంద్రబాబు S.V.Universityలో P.G పూర్తిచేసి ఉన్నారు, విధ్యార్ధి రాజకీయాలతో పరిచయం ఉన్నది. చంద్రబాబు ధీ సాధారణ రైతు కుటుంభం. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ నాయుడు గారి చంద్రబాబు ని అన్ని రకాలు గా ఆదుకున్నారు. కేవలం రెండు జతల బట్టల తో మిత్రుల తో  నియోజక వర్గం అంత తిరిగి ఓటర్ల మనసు చూరగొని జనతా పార్టీ అభ్యర్థి పట్టాభి రామ్ చౌదరి  మీద నెగ్గారు. 

ఇకబోతే పులివెందుల నుండి YS రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష  రాజకీయ రంగ ప్రవేశం చేసారు. 1975 లో గుల్బర్గా లో మెడిసిన్ చదువు పూర్తీ చేసి వచ్చిన YSR పులివెందుల లో ప్రాక్టీస్ పెట్టారు. అలాగే యువజన కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లో కూడా తిరుపతి యువజన కాంగ్రెస్ మీటింగ్ లో సంజయ్ గాంధీ ని కలిశారు. 


పులివెందుల మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఈ నియోజక వర్గం నుండి మూడు సార్లు  నెగ్గిన పెంచికల బసిరెడ్డి మంత్రి గా కూడా పని చేసారు. అలాగే పులివెందుల గ్రామం మండలం లో DN రెడ్డి ఆధిపత్యం కొనసాగేది. ఈ బసిరెడ్డి తరువాతి పరిస్థితుల్లో జనతా పార్టీ లో చేరడం తో పులివెందుల కాంగ్రెస్ YSR నాయకుడు అయ్యాడు. ఏడాది గా YSR గ్రామాల్లో తిరుగుతూ పరిచయాలు పెంచుకున్నారు. 

కాంగ్రెస్ చీలిపోవడం తో YSR కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్  తరుపున నిలబడగా జనతా పార్టీ ఎన్నికల కి ముందు బసి రెడ్డి మరణించడం తో ఆయన స్తానం లో DN రెడ్డి కి టికెట్ ఇచ్చి పోటీ లో నిలిపింది. ఇందిరా కాంగ్రెస్ తరుపున కొత్త అభ్యర్థి బండ్ల సోమి రెడ్డి ని పోటీ లో నిలిపింది.  ఈ ఎన్నికల్లో YSR తన సమీప ప్రత్యర్థి DN రెడ్డి పై విజయం సాధించారు. 


1978 ఎన్నికల్లో  అందరి అంచనాలని తారుమారు చేస్తూ 

ఇందిరా కాంగ్రెస్ 170 

జనతా పార్టీ  57 

రెడ్డి కాంగ్రెస్ AKA కాంగ్రెస్(INC ) 30 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందిరా కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి గా ఉన్న మర్రి చెన్నారెడ్డి CM అయ్యారు. రెడ్డి కాంగ్రెస్ తరుపున గెల్చిన కొందరి లో  చలనం మొదలయ్యింది. ఎన్నికలు గడిచి నాలుగు రోజులైనా గడవక ముందే ఫిరాయింపు లకి తెర లేపారు. 


వారిని ఉద్దేశించి రెడ్డి కాంగ్రెస్ నేత భాట్టం శ్రీరామ్ మూర్తి గారు 1978 అసెంబ్లీ లో  "మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లి కూతురిలా నీ (మర్రి చెన్నారెడ్డి) వైపు మళ్లారు మా పార్టీ శాసన సభ్యులు ...ఏముంది నీలో ఆకర్షణ?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.ఆ పార్టీ పిరాయించిన వారిలో  ప్రభావతమ్మ లాంటి మహిళా శాసన సభ్యులు ఉండటం చేత  ఈ వ్యాఖ్యలకి వెంకటగిరి నుండి ఇందిరా కాంగ్రెస్ తరుపున గెల్చిన నల్లపు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర  అభ్యంతరం వ్యక్తం చేసారు. 


ఇందులో కొందరు మేధావులు YSR మీద పశ్చపాత బుద్ధి తో రెడ్డి కాంగ్రెస్ నుండి గెల్చిన ముప్పై మందికి గాను  ఇరవై మంది MLA లు ఒకేసారి ఇందిరా కాంగ్రెస్ లో  చేరారు . 2 /3 మెజారిటీ సభ్యులు చేరారు గనుకా అది విలీనం కిందకి వస్తుంది ఫిరాయింపు కిందకి రాదూ అని ఎదో లాజిక్ లాగారు. నిజానికి Anti-Defection act 1985 లో రాజ్యాంగం లో చేర్చారు. అప్పటికి ఈ ఫిరాయింపు చట్టం లేదు. 

అలాగే రెడ్డి కాంగ్రెస్ నుండి ఇందిరా కాంగ్రెస్ కి మొదట పిరాయించింది కేవలం 15 మంది మాత్రమే అందులో YSR కూడా ఒకరు. 2 /3 అంటే కనీసం ఇరవై మంది సభ్యులు ఉండాలి కానీ  YSR పిరాయించేనాటికి 15 మందే  ఉన్నారు కాబట్టి అది విలీనం కిందకి కూడా  రాదూ. అలాగే ఫిరాయింపు చట్టం కిందకి రాదూ. సరే అప్పుడు ఆ Anti-Defection act లేదు కాబట్టి  దీనిని  ఫిరాయింపు అనొద్దు ,మరి వ్యక్తిగత నైతికత ఉండద్దా?


సరే ఈ Anti-Defection act వచ్చాక మాత్రం YSR చేసింది ఏముంది ? ఇతర పార్టీ గుర్తు లా మీద గెల్చిన MLA లని తనవైపు కు తిప్పుకోలేదా ? MP లని కాంగ్రెస్ వైపు కి  లాగి  సొంత పార్టీ విప్ ని సైతం దిక్కరించేంత స్థాయి కి వారిని YSR దిగజార్చలేదా ? 


నైతిక విలువల గురించి ఒంటి మీద వలువలు ఉన్నాయో లేదో అన్న సోయ లేకుండా  బోసడింగులు చెప్పే YS ఫామిలీ గెల్చిన పార్టీ నుండి నాలుగు రోజుల కె అధికార పార్టీ లోకి ఫిరాయించడం ఏ  విలువల కిందకి వస్తుంది ? (సశేషం)

ఎన్టీయార్‌ వల్లే కమ్మవారు వెలిగారా ? -1

 చాలామంది సాధారణంగా వేసే ప్రశ్న యిది. కొందరు తమకు తామే సమాధానం కూడా చెప్పేసుకుంటూ ఉంటారు, ఔను అని. సినీరంగంలో కాని, రాజకీయరంగంలో కాని ఎన్టీయార్‌ గారు  వచ్చేదాకా కమ్మవాళ్ళ కు ఏ ప్రాధాన్యతా లేదని, ఎన్టీయార్‌ కులాభిమానం వలననే వాళ్లు పైకి వచ్చారని అనుకుంటారు వాళ్లు. కొంతమంది యింకా ముందుకు వెళ్లి అసలు వాళ్లు ధనికులైనదే తెలుగుదేశం హయాం వచ్చాక అనుకుంటారు. తెలుగునాట కమ్మవారు  అనేక రంగాల్లో ఎప్పణ్నుంచో దూసుకుపోతూ వచ్చారు. విద్య, ఉద్యోగాలలో బ్రాహ్మణులతో, వ్యవసాయంలో రెడ్లతో, వ్యాపారంలో వైశ్యులతో, చొరవ, తెగింపులలో కాపులతో - యిలా అందరితో పోటీ పడుతూ, వేరే ప్రాంతాలకు విస్తరిస్తూ చొచ్చుకుపోయారు. ఎంటర్‌ప్రెనార్‌షిప్‌లో వారిది అందె వేసిన చేయి. శతాబ్దాల క్రితమే వాళ్లు తమిళనాడులో కూడా పాతుకుపోయి వర్ధిల్లారు. భూములు ఎక్కడ చవకగా దొరికితే అక్కడకు వెళ్లి కొని, వ్యవసాయం చేస్తూ నిలదొక్కుకున్నారు. సినిమా రంగంలో ఎన్టీయార్‌ అడుగు పెట్టడానికి ముందే ఎల్వీ ప్రసాద్‌, చక్రపాణి, కెయస్‌ ప్రకాశరావు, గూడవల్లి రామబ్రహ్మం వంటి కమ్మవారు స్థిరపడి వున్నారు. ఇవన్నీ విస్మరిస్తే ఎలా?

ఇక రాజకీయాలకు వస్తే ఎన్టీయార్ గారు ‌ వచ్చేవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి  కమ్మ ముఖ్యమంత్రి లేడన్నమాట వాస్తవమే. కానీ అంతకుమునుపు మద్రాస్ ప్రెసిడెన్సీ లో  ముఖ్యమంత్రిగా వ్యవహరించిన బొల్లిన మునుస్వామి నాయుడు గారు , సెంట్రల్ ప్రావిన్స్ లలో ముఖ్యమంత్రిగానూ మరియు గవర్నర్ జనరల్ గానూ వ్యవహరించిన ఈడ్పుగంటి రాఘవేంద్ర రావు గారు  లాంటి ప్రముఖులు ఉన్నారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్  గారు వచ్చేవరకు లేరు. అంతమాత్రం చేత కమ్మవారు రాజకీయాల్లో లేరని అనగలమా? ఆ మాటకు వస్తే యిప్పటివరకు కాపు ముఖ్యమంత్రి రాలేదు. మరి వాళ్లు రాజకీయాల్లో లేరా? జరిగినదేమిటంటే - కమ్మవారులో  కొందరు రాజకీయ ప్రముఖులు కాంగ్రెసుకు దూరంగా ఉన్నారు. కొంతకాలం జస్టిస్‌ పార్టీ, మరి కొంతకాలం కమ్యూనిజం, యింకొంతకాలం ఎన్‌జి రంగాగారి కృషికార్‌, స్వతంత్ర యిత్యాది పార్టీలు - యిలా ప్రయోగాలు చేశారు. నిజానికి యివేమీ వాళ్ల ఒంటికి పడలేదు. కొందరు నాయకుల విషయంలో ఐతే వారు ప్రవచించే కమ్యూనిజం, సహజమైన భూస్వామ్య లక్షణం రెండు పొసగలేదు. కాట్రగడ్డ మురారి గారు తన ఆత్మకథ ''నవ్విపోదురు గాక..'' లో యీ వైరుధ్యాన్ని బాగా పట్టుకుని తెలియచెప్పారు. ఆంధ్ర రాష్ట్రం విడిగా ఉండగా కృష్ణా, గుంటూరు జిల్లాలలో కమ్యూనిస్టు ఉద్యమం జోరుగా సాగడానికి కారణం కమ్మవారి  మద్దతే. అక్కడే బెంగాల్‌ విప్లవనాయకుల పేర్లు బెనర్జీ, చటర్జీ, బోసు వినబడతాయి.


ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం కలవడంతో మొత్తం రాష్ట్రం మీద చూస్తే కమ్యూనిస్టు ప్రభావం తగ్గుముఖం పట్టింది. 1952లో ఆంధ్రలో కమ్యూనిస్టులు 35% సీట్లు తెచ్చుకోగా, 1962లో ఆంధ్రప్రదేశ్‌లో 17% సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. పైగా ఆ తర్వాత కమ్యూనిస్టులు చీలిపోయారు కూడా. ఈ లోగా రెడ్లలో చాలామంది కాంగ్రెసునే అంటిపెట్టుకుని లాభపడ్డారు. ఆ విషయం గ్రహింపుకి వచ్చేసరికి, యితర కులాల వాళ్లు కూడా కాంగ్రెసువైపే మొగ్గు చూపారు. కాంగ్రెసుపైకి సామ్యవాదం పేరు చెప్పినా, దళితకులాలకు, మైనారిటీలకు మేలు చేస్తామని చెప్పుకున్నా ఆచరణలో అది యథాతథ పార్టీ అని, పెట్టుబడిదారులకే, అగ్రకులాలకే మేలు చేస్తుందని వీరర్థం చేసుకున్నారు. అందువలన కమ్మవారు కూడా కాంగ్రెసులో బాగానే చేరారు. కాంట్రాక్టులు అవీ తెచ్చుకున్నారు. వ్యాపారాలు చేశారు, పదవులు సంపాదించుకున్నారు, పైకి వచ్చారు. కాంగ్రెసు పాలనలో రెడ్లు బాగుపడ్డారని, టిడిపి పాలనలో కమ్మవారు బాగుపడ్డారని జనరల్‌గా అనేస్తారు కానీ డబ్బున్నవాళ్లకి ఎవరి పాలనలోనైనా పనులు జరుగుతూనే ఉంటాయి. 1983లో టిడిపి అధికారంలోకి వచ్చేవరకు కమ్మవారు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేదా? రాష్ట్రంలో, కేంద్రంలో మంత్రులు కాలేదా?


ఇందిరా గాంధీ అధికారంలో నిలదొక్కుకున్నాక ప్రతి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలను మార్చేసిందని రాశా కదా. ఆంధ్రప్రదేశ్‌లో రెడ్డి, కమ్మ కులాలు భూస్వాములుగా, వ్యాపారస్తులుగా బలపడడమే కాక రాజకీయంగా పలుకుబడి సంపాదించి మోతుబర్లుగా ఉన్నారని గ్రహించిందామె. వీళ్లు తన వెంటే ఎప్పుడూ వుంటారన్న నమ్మకం లేదు. అందువలన వారి ప్రాభవాన్ని తగ్గించి, యితర కులాలలను, బిసిలను, ఎస్సీలను, మైనారిటీలను, డబ్బు లేనివారిని రాజకీయంగా పైకి తీసుకుని వచ్చి, వాళ్లు తనకు ఎప్పటికీ విధేయులుగా వుండేట్లు చూసుకుందా మనుకుంది. (తర్వాతి రోజుల్లో ఎన్టీయార్‌ బిసిలతో యిదే ప్రయోగం చేశారు) 1972 అసెంబ్లీ ఎన్నికలలో యీ ప్రయోగాన్ని అమలు చేద్దామనుకుంది. ఏ బలమూ లేని బ్రాహ్మణుణ్ని ముఖ్యమంత్రిగా పెట్టడంతో బాటు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మహమ్మద్‌ ఇస్మాయిల్‌ అనే కాకినాడ ముస్లిముని నియమించింది. బిసి నాయకుడిగా పేరుబడిన టి. అంజయ్యను (ఈయన ముఖ్యమంత్రయ్యాక తను 'రెడ్డి'నని, కానీ బిసిలకు దత్తు పోయానని చెప్పుకున్నాడు) ఉపాధ్యక్షుడిగా పెట్టింది.


15 మందితో ఎన్నికల కమిటీ పెట్టింది. బ్రహ్మానంద రెడ్డి, అతని అనుచరుడు విజయభాస్కరరెడ్డిలకు యీ కమిటీలో స్థానం యివ్వలేదు. 1967లో రెడ్లకు 69 సీట్లు కేటాయించగా యీసారి 47 మాత్రమే యిచ్చారు. అలాగే కమ్మవారు 47 సీట్ల నుంచి 29కి తగ్గించారు. తక్కిన అగ్రవర్ణాలకు గతంలో 53 యిస్తే యీసారి 49 మాత్రమే యిచ్చారు. మొత్తం సీట్లలో యీ మూడు వర్గాలకు కలిపి 46% యిచ్చారు. ఇక బిసిలకు 64, మైనారిటీలకు 20, తక్కినవి ఎస్సీ, ఎస్టీలకు యిస్తూ మొత్తంలో 30 మంది మహిళలు ఉండేట్లు చూశారు. 230 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలలో 116 మందికి మాత్రమే టిక్కెట్లు యిచ్చారు. దెబ్బకి 14 మంది మాజీ ఎమ్మెల్యేలతో సహా 200 మంది అసంతృప్త కాంగ్రెసు వాదులు ఎన్నికలలో తిరుగుబాటు అభ్యర్థులుగా నిలబడ్డారు. దాంతో 97 మందిని సస్పెండు చేశారు. 300 మందిని పార్టీలోంచి తీసేశారు. అలా సస్పెండైన వారిలో జలగం వెంగళరావు, బ్రహ్మానంద రెడ్డి సోదరుడు కాసు వెంగళరెడ్డి కూడా ఉన్నారు.


ఎన్నికలలో ఇందిరా ప్రభంజనం వీచింది. కులంతో, అభ్యర్థితో ప్రమేయం లేకుండా ఆమె నిలబెట్టిన వాళ్లంతా గెలిచారు. 287 స్థానాలుంటే కాంగ్రెసు 219 (76%), 52% ఓట్లు గెలిచింది. దాని మిత్రపక్షమైన సిపిఐకు 6% ఓట్లు, 7 సీట్లు. దాన్ని వ్యతిరేకించిన సిపిఎంకు 3% ఓట్లు, 1 సీటు. స్వతంత్రులు 57. స్వతంత్ర పార్టీకి రెండు సీట్లే. 26 మంది మహిళలు, 10 మంది ముస్లిములు గెలిచారు. దీనికి కారణం - వెనుకబడిన వర్గాలు, కులాలు, బలహీనవర్గాలు ఇందిర 'గరీబీ హటావో' నినాదాన్ని నమ్మి, ఆరాధించి, ఆమె వెంట నిలిచారు. ఓట్లు కురిపించారు. భూస్వామి, ధనికవర్గాల వారే ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డారని, ఆమెకు బలాన్ని అందించి, వారిని అదుపు చేయాలని వాళ్లు కోరుకున్నారు, సాధించారు.

1983 నాటి ఎన్టీయార్‌ గారి  నాటి రాజకీయాల గురించి చెప్తానంటూ 1972 నాటి రాజకీయాల గురించి యింత విపులంగా ఎందుకు చెప్తున్నా ననుకుంటున్నారా? ఆంధ్రలో తెలుగుదేశం ఆవిర్భవించాక ఏ వర్గాలు దాని వెనుక నిలిచి కాంగ్రెసుపై, సరిగ్గా చెప్పాలంటే ఇందిరపై కసి తీర్చుకున్నాయో చెప్పడానికే యిదంతా. ఇది తెలుసుకోకుండా, కేవలం ముఖ్యమంత్రులను మార్చారనో, తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బ తిందనో, ఎన్టీయార్‌ సాక్షాత్తూ కృష్ణుడే అని వెర్రి జనాలు నమ్మారనో తీర్మానాలు చేసేస్తే సరియైన చిత్రం గోచరించదు. ఎన్నికల తర్వాత కొందరు పివిని తీసేయాలని పట్టుబట్టారు కానీ ఇందిర వాళ్లను అదలించి నోరు నొక్కారు. ఎందుకంటే ఆమె ఎజెండా యింకా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో భూస్వామి వర్గాలను రాజకీయంగా దెబ్బ తీస్తే సరిపోదని, ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తే కానీ అణగరని ఆమె భావించారు. అందుకే దేశంలో తక్కిన చోట్ల చేయకపోయినా ఆంధ్రలో భూసంస్కరణలు అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు.

పివి కాక మరొక ముఖ్యమంత్రైతే అది రాజకీయంగా అది రిస్కని అడ్డుపడేవారు. కానీ పివికి అలా అడ్డుపడేటంత స్తోమత లేదు. పైగా ఆయన సిద్ధాంతరీత్యా యీ సంస్కరణలకు అనుకూలుడు. అందువలన సరేనన్నాడు. 1972 సెప్టెంబరులో భూసంస్కరణల బిల్లు పాసయింది. అంతకు ముందు జులైలో అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌ చట్టం వచ్చింది. రెడ్డి, కమ్మ, క్షత్రియ వంటి భూస్వామ్య కులాలన్నీ పివిపై, ఇందిరపై పగబట్టాయి. బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యాయి. పివి ఆదర్శం మంచిదే కానీ, దాన్ని అమలు చేయడానికి, యీ శక్తులను ఎదుర్కొనడానికి తగిన రాజకీయ శక్తి ఆయనకి లేకపోయింది. పైగా తన ప్రతిక్షకులకు ఆయనే స్వయంగా ఒక ఆయుధాన్ని  అందించారు. తెలంగాణలో స్థానికులకు రిజర్వేషన్‌ కల్పించే ముల్కీ నిబంధనలపై కేసు సుప్రీంకోర్టులో నలుగుతోంది. ముల్కీ నిబంధనలు చెల్లుతాయని కోర్టు తీర్పు రాగానే పివి హర్షం ప్రకటిస్తూ 'ముల్కీ సమస్యకు యిదే తుది పరిష్కారం' అన్నారు.

అది ఆంధ్ర ప్రాంతపు భూస్వామ్య వర్గాలకు అందివచ్చింది. భూ సంస్కరణలు వచ్చిన నెలలోపే పివి తెలంగాణ పక్షపాతి అని ఆరోపిస్తూ విద్యార్థుల ఉద్యమం ప్రారంభమైంది. పివి ఏలూరులో ఒక సభకు వస్తే అవమానించి పంపించారు. అక్టోబరు 24 నుంచి ఎన్‌జిఓలు సమ్మె మొదలుపెట్టారు. మొదట్లో ముల్కీ రద్దు, లేదా రాష్ట్ర విభజన అన్నారు. తర్వాత్తర్వాత రాష్ట్ర విభజన తప్పనిసరి అన్నారు. 1972 చివరకు వచ్చేసరికి జై ఆంధ్ర ఉద్యమం పరాకాష్టకు చేరింది. పివి పంచాయితీ రాజ్‌, జిల్లా పరిషత్తులు రద్దు చేయడానికి సమకట్టడం వలన స్థానిక కాంగ్రెసు నాయకులందరూ ఆయనపై కత్తి కట్టారు. ఇందిర రాష్ట్రవిభజన ససేమిరా కుదరదన్నారు. ఇక్కడ తమాషా ఏమిటంటే జై ఆంధ్ర ఉద్యమాన్ని నడిపించినది, ఎదిరించినదీ కూడా కాంగ్రెసు నాయకులే. అటూయిటూ వాళ్లే.

సంస్కరణల ప్లాను ఇందిరదే ఐనా, అమలు చేసినది పివి కాబట్టి, ఆయనను ముఖ్యమంత్రిగా తీసేయాలని ఆంధ్ర కాంగ్రెసు నాయకులు, భూస్వామ్యవర్గాలు పట్టుబట్టాయి. భవిష్యత్తులో యిక ఏ ముఖ్యమంత్రీ యింతటి తీవ్రనిర్ణయాలు తీసుకోకుండా చేయాలని ప్రయత్నం కాబోలు. నిజంగా ఆ తర్వాత ఆ వర్గాల జోలికి ఎవరూ వెళ్లలేదు - ఉద్యోగుల విషయంలో తీవ్రనిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని సందర్భాలలో కొన్ని వ్యాపారవర్గాల పట్ల తీసుకున్నారు తప్ప!  భూసంస్కరణలు నామమాత్రంగా మిగిలాయి. 1973 జనవరిలో పివిని ముఖ్యమంత్రిగా తీసివేసి, గవర్నరు పాలన పెట్టడంతో యీ భూస్వామి వర్గాలు క్రమేపీ చల్లారాయి. కాంగ్రెసు వాళ్లకి లోపల్లోపల బేరాలు కుదిరిపోయాయి. ఆరుసూత్రాల పథకం అని పెట్టి ఉద్యమాన్ని నీరు కార్చేశారు. ఉద్యమానికి విరాళాలు యిచ్చేవారు లేకపోయారు. 1973 ఫిబ్రవరిలో కమ్మ కులస్తుడైన కొత్త రఘురామయ్యను కేంద్ర కాబినెట్‌లోకి ఇందిర తీసుకోవడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉద్యమం ఉధృతి తగ్గింది. అప్పటిదాకా ఉద్యమానికి మద్దతిచ్చిన ఎన్‌జి రంగా అనుయాయులు కూడా ఇందిరను సమర్థించ సాగారు. 1973 ఏప్రిల్‌ నాటికి ఉద్యమం నామమాత్రంగా మిగిలింది.

గవర్నరు పాలన 11 నెలలు గడిచాక, పివి స్థానంలో మరో ముఖ్యమంత్రిని నియమించ వలసిన అవసరం వచ్చింది. తెలంగాణ వ్యక్తి పదవీకాలం పూర్తి కాలేదు కాబట్టి, యింకో తెలంగాణ నాయకుడికే అధికారం యివ్వాలి. రెడ్డి లేదా కమ్మవారి  పాలన తెచ్చే ఉద్దేశం ఇందిరకు లేదు. అందువలన వాళ్లిద్దరూ కాకుండా వెలమ కులానికి చెందిన జలగం వెంగళరావుకి యిచ్చారు. రెడ్డి కాడు కాబట్టి కమ్మవారు వెంగళరావుకి అండగా నిలిచారు. వెంగళరావు 1973 డిసెంబరులో అధికారంలోకి వచ్చి 1978 మార్చి వరకు పాలించారు. ఈయన అందరికీ ఆప్తుడిగానే మెలిగాడు. పెద్దగా అసమ్మతిని ఎదుర్కోలేదు కూడా. ఎందుకంటే బ్రహ్మానందరెడ్డి కేంద్రమంత్రి అయిపోయారు. చెన్నారెడ్డి యుపి గవర్నరుగా వెళ్లిపోయారు. అయితే పివి మాత్రం కేంద్రమంత్రిగా వెళ్లి ఇందిరకు సన్నిహితుడిగా మెలగుతూ, వెంగళరావుకు వ్యతిరేకంగా పని చేసిన బసిరెడ్డిని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఏది ఏమైనా 1975 జూన్‌లో ఎమర్జన్సీ విధించడంతో, వెంగళరావుకి ముప్పు లేకుండా పోయింది. ఉత్తరాదితో పోలిస్తే ఎమర్జన్సీ అత్యాచారాలు ఆంధ్రలో తక్కువే జరిగాయి.


1977లో ఎమర్జన్సీ ఎత్తివేసి ఎన్నికలకు వెళితే జనతా పార్టీ ఉత్తరాదిన బ్రహ్మాండమైన విజయం సాధించింది. దాంతో యిక్కడ కూడా జనతా పార్టీ వెలిసింది. ఇందిర కారణంగానే కాంగ్రెసు పార్టీ ఘోరంగా ఓడిపోయిందంటూ ఆమెను పార్టీలోంచి బహిష్కరించారు. పార్టీ చీలింది. బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షుడిగా కాంగ్రెసు (ఆర్‌) అనే పార్టీ ఏర్పడితే వెంగళరావు దానిలో చేరారు. ఇందిర తను అధ్యక్షురాలిగా కాంగ్రెసు (ఐ) ఏర్పరిస్తే గవర్నరుగా పదవి పోయిన చెన్నారెడ్డి వచ్చి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యారు. 1978 అసెంబ్లీ ఎన్నికలలో ఈ కాంగ్రెసు (ఆర్‌), కాంగ్రెసు (ఐ), జనతా పార్టీ పోటీ పడ్డాయి 

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...