14, నవంబర్ 2020, శనివారం

పెమ్మసాని వారి చరిత్ర - 3

 మహమ్మదీయ ముష్కరుల కుట్ర ల ఫలితంగా చేజారిన గండికోట ని విడిచి యువరాజు ని వెంటబెట్టుకొని పెమ్మసాని వారి బంధువర్గం లో  ఉన్న సాయపనేని, రావెళ్ల, ఘట్టమనేని,మిక్కిలినేని, నారా  మున్నగు  66 ఇంటిపేర్లు గల కమ్మవీరులు  నలుదిశలా వలస పోయారు.కొందరు నెల్లూరు, చిత్తూరు, అప్పటి గుంటూరు సీమలని చేరగా మరికొందరు  పెమ్మసాని వంశం లో మిగిలిన యువరాజుని తీస్కొని మరింత దక్షిణాదికి వలస పోయి  వారి బంధువులు అగు మధురై పాలకులు అయినా నాయకర్ల ని ఆశ్రయించగా మధురై విశ్వనాధ నాయకుడు తన రాజ్యం లో ఉన్న కురువికులం, నాయకర్ పట్టి మొదలగు సంస్థానాలని పెమ్మసాని వారికి, ఇలాయరసంధవెల్ అనే సంస్థానం ని రావెళ్ల వారికి కట్టబెట్టాడు. 

ఆలా 1652 -1948 వరకు పెమ్మసాని వారు కురివికులం జమీందారు లు ఏలుబడి ని కొనసాగించారు. స్వతంత్ర భారతం లో సంస్థానాల రద్దు తో అది కూడా చేజారిపోయింది. ఆ కురివికులం సంస్థానం చివరి పాలకుడు పెమ్మసాని కొండల రామస్వామి నాయుడు గారు ఉన్నత విద్యావంతుడు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ వెళ్లి బారెట్ లా చదివి వచ్చారు. 1914 లో కపిలేశ్వరపురం లో జరిగిన రెండవ కమ్మ మహాజన సభ కి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 

రామస్వామి నాయుడి గారికి మగ సంతానం లేదు ఒక్కరే ఆడకూతురు. ఆవిడ ని కృష్ణ జిల్లా రంగాపురం జమిందార్ లు అగు అడుసుమిల్లి కుటుంబానికి కోడలి గా పంపారు. అంతటితో రాజవంశం అంతరించినట్లయింది. పెమ్మసాని-అడుసుమిల్లి వారి మనవరాలు గా ప్రముఖ సినీ నటుడు మురళి మోహన్ గారి కుమారుడు రామ్ ని వివాహం చేసుకొన్నా "మాగంటి రూప" ఈ వంశం లో నాయనమ్మ పుట్టింటి తరపున మిగిలిన చివరి వారసురాలు.  

పెమ్మసాని  బంధుగణం లో పేరెన్నికగన్నవారిలో మరో ప్రముఖులు చిత్తూరు జిల్లా కే చెందిన హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి పెమ్మసాని శంకర నారాయణ ఒకరు. అలాగే గండికోట పతనంతరం కోట వదిలి గుంటూరు సీమలోని బుర్రిపాలెం కి వలస వచ్చి రెండు కుటుంబాల్లో ఒకటి పెమ్మసాని సాంభశివరావు ధీ కాగా మరొకటి ప్రముఖ సినీ నటులు సూపర్ స్టార్  ఘట్టమనేని కృష్ణ గారి ధీ మరో కుటుంభం. 

నవ్యాoధ్ర రాజధాని గా తెర మీద కి అమరావతి శంఖుస్థాపన సందర్భoగ పెమ్మసాని రాజవంశీయులు అయినా నెల్లూరు జిల్లాకి చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు గారు బుర్రిపాలెం పెమ్మసాని వారి తో కలిసి గండికోట రాజశిల ని బహుకరించిండం కొసమెరుపు. 

సామాన్య గృహస్థులు గా మొదలెట్టి దాదాపు ఐదు వందల ఏళ్ళు గండికోట, యాడికి, గుత్తి, కురువికులం  మొదలగు సీమలని, సంస్థానాలని పరిపాలించి చివరికి స్వాతంత్ర భారతం లో మల్లి సామాన్య గృహస్థులు గా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూర్ జిలాల్లో మిగిలిపోయిన పెమ్మసాని రాజవంశీయుల చరిత్ర ఇది. 

ఈ వివరాలని టీవీ 9 వారు చేసిన "మనకి తెలియని మన చరిత్ర" అనే  ప్రోగ్రాం లో నాటి గండికోట నుండి కురువికులం  దాక పెమ్మసాని తెలుగు వంశీయుల చరిత్ర ని పొందుపరిచినా ప్రోగ్రాం లో చూడవచ్చు. అలాగే కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన "గండికోట యుద్ధం", తవ్వా ఓబుల రెడ్డి రాసిన "గండికోట"  చరిత్ర లో మరిన్ని వివరాలు దొరుకుతాయి. 


పెమ్మసాని వారి చరిత్ర -2

 పెమ్మసాని వంశ మూలపురుషుడు తిమ్మనాయని తరువాత మరో ప్రసిద్ధ వ్యక్తి పెమ్మసాని రామలింగ నాయకుడు లేదా పెమ్మసాని రామలింగ నృపాలుడు.  ఈ రామలింగ నాయకుడికి పెమ్మసాని పెద్ద తిమ్మనాయుడు అనే సోదరుడు కూడా ఉన్నట్లు చాటువుల్లో తెలుస్తుంది. వీరిరువురు సాళువ వంశస్థులు అయినా వీర నరసింహ రాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు వారి వద్ద సామంతులు గా ఉన్నారు. పెమ్మసాని వారి  సోదరి "పెమ్మసాని నాగలాంబ"  ని సాళువ  వీరనరసింహ రాయలుకి ఇచ్చి వివాహం  చేసినట్లు వారి కుమారుడే శ్రీ కృష్ణ దేవరాయలు అని ప్రముఖ చరిత్ర పరిశోధకు లు "ముత్తేవి రవీంద్రనాధ్" గారు  తమ పరిశోధాత్మక పుస్తకం అయినా "శ్రీకృష్ణ దేవరాయలు వంశ మూలాలు" అనే పుస్తం లో రాసుకొచ్చారు. 

కారణాలు ఏవైనా సాళువ  రాయల పాలనా లో పెమ్మసాని వారి ఖ్యాతి, కీర్తి మరింత ఇనుమడించింది. గండికోట సీమ పాలకులు గానే గాక శ్రీకృష్ణ దేవరాయలు పాలనా లో వారి సర్వ సైన్యాధక్షుడిగా పెమ్మసాని రామలింగ నృపాలుడు ఉండేవాడు అని అతని కింద దాదాపు 80 వేల మంది సైనికులు ఉండేవారని కైఫీయతు లలో ఉంది. ఆ కాలం లో కల్బర్గ్ రాజధాని గా మహమ్మద్ యేదుల్ ఖాన్ పాలించేవాడు. రాయలు కల్బర్గ  మీద దండయాత్ర కి వెళ్ళినప్పుడు వారికీ సహాయంగా గోల్కొండ  నవాబ్ కూడా యేదుల్ ఖాన్ కి మద్దతు గా రావడం తో యుద్ధం భయంకరంగా సాగింది. అలాంటి క్లిష్ట సమయం లో పెమ్మసాని రామలింగ నాయకుడు సింగపు బిల్లవలె యుద్ధరంగం లో పది వేల సేన తో దూకి రాయలు కి  అండగా నిలబడి యుద్ధం లో తురక సేన లో చొరబడి వారి డేరీజు  త్రాళ్లు తెగగోసి అనేక మందిని సంహరించి  రాయలుకి విజయం కి చేకూర్చి పెట్టాడు.  అప్పుడు రాయలు మిక్కిలి కొనియాడి అనేక బహుమానాలు ఇచ్చారు. ఈ యుద్ధ ఘట్టం గురించి "శ్రీకృష్ణరాయ విజయం" అనే గ్రంధం లో ఇలా వర్ణింపబడి ఉంది 

"విని యా భూవరా కోటిలోన ఘన ధో - ర్వీర్య ప్రతాపండు బం

ధు నృపాలా ప్రభాలుండు యుద్ధముల యం- దుం స్వామి కార్యంబులం 

దున యఘ్నుoడగు పెమ్మసాని కుల చం - ద్రుoడైన యా రామలిం 

గా నృపాలాగ్రణి వల్కె సంగర కళా -కౌతుహా లయత్తుడై 


పెమ్మసాని రామలింగ నృపాలుని యుద్ధరంగా పరాక్రమం ని  గూర్చి 

"అనుచుo బల్లెం గెలభూనుకొని శౌ - ర్యరూఢులై కమ్మవా

ర్వేనువేటం బదివేలు బల్లెముల తో - విఖ్యాత శౌర్యాన్నితం 

జనుదేరం ఘన సింహారావ మలరం - ధంసైన్యంజొచ్చి హై

చ్చిన దైర్యంబున బారసీకా తతులం - జెండాదే నుద్దంఢుడై "

ఇలాగె యుద్ధం లో పది వేల మంది కమ్మ యోధుల సహాయం తో ఈ శూరశిఖామణి అద్భుత పరాక్రమం చూపి తురక సైనికుల్ని పారద్రోలి వజీర్లని హతమార్చాడు.  రామలింగ నాయకుడు తన పేరు తో తాడిపత్రి లో ప్రసిద్ధ రామలింగేశ్వర దేవాలయం కట్టించాడు. తాడిపర్రు బస్తి ని కట్టించి అభివృద్ధి చేసారు. ఈయన తన పేరు తో రామలింగనాయని పల్లె కూడా నిర్మించారు. యర్రమల కొండా బుగ్గ వద్ద ఓబులేశ్వరాలయం కూడా కట్టించి ఇచ్చారు. 

రామలింగ నాయునికి ఇద్దరు కుమార్తెలు ఒకరు రాజగోపాలమ్మ మరొకరు గోవిందమ్మ. ఈ గోవిందమ్మ ని ప్రకాశం జిల్లా ధూపాటి సీమ నేలే "శాయపనేని" వంశస్థులకి ఇచ్చి చేసినట్లు ఆవిడ కూడా మహా యోధురాలు అని తెలియుచున్నది. 

పెమ్మసాని రామలింగ నాయుని తరువాత మరో యోధుడు పెమ్మసాని పెద్ద తిమ్మానాయుడు. ఈయన కూడా మహాయోధుడు అని ఒక బాణపు వేటు తో గుర్రపు డొక్కా తేల్చి వేయగల శూరుడు అని ప్రతీతి. ఇలా 1431 నుండి  1652 వరకు దాదాపు 250 ఏళ్ళు గండికోట సీమ ని పెమ్మసాని వంశీయులే పరిపాలించారు. 1652 వ సంవత్సరం ఆగష్టు 25 నా పెమ్మసాని చిన్న తిమ్మనృపాలుడు  హయం లో   గోల్కొండ నవాబుల పాలెగాడు మీర్ జమ్లా కుట్ర తో ధనం ఆశచూపి గండికోట మంత్రి అయినా "పొదిలి లింగన్న" అనే బ్రాహ్మణుడిని లొంగదీసుకుని పెమ్మసాని తిమ్మ నృపాలుడికి విష ప్రయోగం జరిపించి హత్య చేయించి గండికోట ని వశపర్చుకున్నాడు. ఆలా తెలుగు నాట మిగిలిన ఒకే ఒక్క హిందూ సామ్రాజ్యం కూడా మహమ్మదీయుల దండయాత్ర లో అంతరించి పోయింది


పెమ్మసాని వారి చరిత్ర - 1

పెమ్మసాని నాయకులు "ముసునూళ్ల"  గోత్రీకులు. వీరిని గండికోట కమ్మవారి గా పిలుస్తారు. వీరి వృత్తాంతం విజయనగర సామ్రాజ్యం లో  ప్రౌఢ దేవరాయల కాలం నుండి మాత్రమే తెలియుచున్నది. వీరు మొదట సామాన్య గృహస్థులు గా ఉండేవారని తరువాత విజయ నగర సామ్రాజ్య నిర్మాతలు అయినా రాయల వారి  మన్నన చూరగొని వారికి దండనాయకులు గా, సైన్యాధిపతులు ఉండటమే గాక ప్రస్తుత  కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర ఉన్న "గండికోట" ని రాజధాని గా చేసుకొని గండికోట సామంత రాజ్యాన్ని దాదాపు మూడు వందల ఏండ్లకి పైగా పాలించారని తెలుస్తుంది. 

పెమ్మసాని  వంశ పూర్వ నామం "ఆలం" వారని వారి వంశ మూలపురుషుడు మొదటి తిమ్మనాయుడు. పెమ్మసాని అనేది "పెమ్మయాసాహిణి" అనే పదానికి వికృత రూపం అని  సాహిణి అనగా గుర్రపు రౌతు లేదా వీరుడు అని అర్ధం. జన శృతుల్లో క్రమంగా పెమ్మయా సాహిణి కాస్త  పెమ్మసాని గా స్థిరపడినట్లు కొందరి  చరిత్ర కారుల అభిప్రాయం. 

క్రీ శ  1431 లో  సంగమ  రాయల  వంశం లో ప్రౌఢ దేవరాయలు పెమ్మసాని తిమ్మనాయుడ్ని గుర్తించి అతనికి "యాడకి" పరగణ పరిపాలన అధికారాన్ని ఇచ్చినట్లు ఆ తరువాత ప్రౌఢ దేవరాయలు నేతృత్వం లో అనేక యుద్ధములలో పాల్గొని తిమ్మనాయుడు శౌర్యం చూపినందుకు గాను మెచ్చి గండికోట పాలనా అధికారాన్ని కట్టబెట్టినట్లు  కైఫీయతు లలో ఉంది.  పెమ్మసాని తిమ్మనాయుడికి  ముందు గండికోట పాలకుడు గా ఉన్న జిల్లెల్ల చలపతి రాజు కట్టించిన కోటని మల్లి పునరుద్ధరించి కట్టించాడు. గండికోట లోనే గాక యాడికి, గుత్తి లలో కూడా మరో రెండు కోటలని కట్టించుకొని గుత్తి, గండికోట సీమలని పరిపాలిస్తూ వచ్చాడు. 

కాలానుగుణంగా పెమ్మసాని వారి రాజ్యం అభివృద్ధి చెందసాగింది. వీరి రాజ్యం లో  నెల్లూరు, గుంటూరు, అనంతపురం, కృష్ణ మండలాల్లో చాలాభాగం ఉందని వీరు ఆ కాలం లో రాయలుకి తొమ్మిది లక్షల రూపాయిలు కప్పంగా చెల్లిస్తూ ఉండేవారని వీరి రాజ్య ఆదాయం ఇరవై ఐదు లక్షలు రూపాయిలు అని వీరి కింద 25 వేల మంది కాల్బలం 15 వేల అశ్విక దళం, 40 వరకు గజములు ఉన్నాయని ఈ వంశీకులకి "ఆధివీర" అనే  బిరుదులు కలవని శ్రీ మున్నంగి లక్ష్మి నరసింహ శర్మ గారు రాసుకొచ్చారు.  ఈ పెమ్మసాని వారు సొంత రూకలు, మాడలు కూడా వేయించి చలామణి చేయించినట్లు కూడా చరిత్ర రికార్డు లలో ఉంది. ఈ నాణాలకి ఒక వైపు వారి కుల దైవం వీరభద్రుడు రెండవ వైపు వెంకట రమణ ప్రతిమలు ఉండేవని స్థానిక చరిత్రలు చెబుతున్నాయ్.  ఈ పెమ్మసాని వారు విజయనగర సామ్రాజ్యం లో ప్రసిద్ధి చెందిన పాలెగాండ్రు అని వారికి విజయనగర రాజ్యం లో ముఖ్య కార్యక్రమాల నిమిత్తం  సపరివారసమేతంగా విచ్చేసినప్పుడు బస చేయడానికి  స్వయంగా 1,240 కుంటల స్థలాలు  కలిగి ఉన్నారని " విజయనగర సామ్రాజ్యం" అనే  ప్రాచీన కడితి పుస్తకం లో ఉన్నది. 

పెమ్మసాని తిమ్మనాయుడు కాలం లో కోటలనే గాక గుళ్ళు గోపురాలు కూడా పునరుద్దించారు, అగ్రహారాలు కట్టించారు. 1454 లో కోడూరు అనే అగ్రహారం కట్టించి ఇచ్చినట్లు చాటువుల్లో తెలుస్తుంది. అలాగే యాడికి కోట కట్టించడానికి త్రవ్వుతుండగా వీరభద్ర,గణపతి విగ్రహాలు దొరికితే వారికీ దేవాలయాలు కట్టించాడని అలాగే ఆoజనేయ స్వామి దేవాలయం కూడా కట్టించినట్లు యాడికి కైఫీయతు లలో దొరికింది . 

"చాలు గుఱ్ఱాలు మౌళి గడి -సంగడి రాజులూ గొల్వ రండహో 

హాలాహాలోగ్రపాలదహ -నార్చుల యంతటి దాటి వాడు నా 

యేలిక వెంకటాద్రి ధర -నిశుని తిమ్మడు పెమ్మసాని భూ 

పాలుడు హెచ్చు ధాత్రి గల -పార్థివు లెల్లరు లొచ్చువారికిన్"

సంగమ వంశం లో మల్లిఖార్జున రాయలు తరువాత విరూపాక్ష, రెండవ ప్రౌఢ దేవరాయలు 1487 వరకు విజయనగర సామ్రాజ్యం ని పరిపాలించారు. ఆ తరువాత సాళువ నరసింహ రాయలు రాజ్యం ఆక్రమించి 1493 వరకు పాలించారు. గండికోట సామంతులు అయినా పెమ్మసాని వారు కూడా సంగమ వంశస్థుల నుండి సాళువ వంశస్థుల దగ్గర సామంతులు గా చేరారు. 








11, నవంబర్ 2020, బుధవారం

మంచి మాటలు

వర్ణధర్మాలన్న ఉక్కు చట్రముపగిలి

మాలకన్నమదాసు మనసైన సుతుడుగా

వీరవైష్ణవమొచ్చెనూ... పలనాట

బ్రహ్మన్న కలిగీతలో

పలనాడు వెలలేని మాగాణి రా...(కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య )


తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-

   సంకోచ పడియెదవు సంగతేంటిరా ?

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదoచు-

  సకిలించు ఆంధ్రుడా ! చావవేటికిరా .(మహా కవి కాళోజి)


ఇల్లు వాకిలి రొసె

ఇల్లాలు తెగ రొసె 

ఈ తీరుగా ఉందిరా కొడకా 

పట్టె మంచెం రొసె 

పడక దిండు రొసె 

పంచ పాలయితిరా కొడకా 

నేను పంచ పాలయితిరా కొడకా...!


"ప్రతిమల పెండ్లి  సేయుటకు వందల వేలు వ్యయించుఁగాని ధుః

ఖితమతులైన పేదల పకీరులా శూన్యములైన పాత్రలన్

మెతుకు విదల్ప  ధీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే 

వత లెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తు లాఱునా ..! "(కవి చక్రవర్తి గుర్రం జాషువా)


జాతస్యమరణంధ్రువం అన్నారు 

పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవాల్సిందే 

మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే స్మశానం మనిషి గురించి ఎదురు చూస్తుంటుంది 


చావు రానిదెవ్వరికి లేనిదెవరికి 

మహారాజులైనా మహారాణులైన మానవుడి ఆఖరి మజిలీ అదే ..! 

మహాకవి జాషువా గారు ఏమన్నారో తెలుసా 


"ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని

కలము,నిప్పులలోన గరిగిపోయే..

యిచ్చోటనే భూములేలు రాజన్యుని

యధికారముద్రికలంతరించె!

యిచ్చోటనే లేత ఇల్లాల నల్లసౌరు

గంగలోన గలిసిపోయే...


"యిచ్చోటనే వెట్టి పేరెన్నికం గనుగొన్న

చిత్రలేఖుని కుంచియ నశించిపోయే!"








గుర్రం జాషువా వర్ధంతి సందర్బంగా నా అక్షర నివాళులు

 ఒకనాడు సాహిత్యం తొంబై శాతం ప్రజల స్థితిగతుల్ని గాలికి వదిలేసి కేవలం పదిశాతం ఉన్న ఉన్నత వర్గాలవారి జీవన విధానాలని సంస్కృతులని ప్రతిబింబిస్తూ వారికి ఊడిగం చేస్తున్నప్పుడు అణచబడ్డ వర్గాల నుండి ఉవ్వెత్తిన ఎగిసిపడి దళితులని కథావస్తువులు గా మలిచి వారి జీవన విధానాలను కావ్యాలు గా పద్యాలూ రాసినా నవయుగ కవి చక్రవర్తి, కవి వైతాళికుడు #గుర్రం_జాషువా.


ఇరవయో శతాబ్దం తెలుగు సాహిత్యం లో విప్లవాత్మక భావాలూ ప్రవేశించిన కాలం. అట్టడుగు వర్గాల ప్రజలు కావ్య వస్తువులయినా సందర్భం. అలాంటి సమయం లో అరిగిపోయిన అక్షరాలకు సానబెట్టి, రంగు వెలిసిన పదాలకి మెరుపులద్ది, పద్య శవాలకు ప్రాణం పోసి, సామాజిక దురన్యాయాలని ఎండగడ్తూ ఖండ కావ్యాల చురకత్తులు ఝుళిపిస్తూ సాహితి కదనరంగాన దూకిన కలం యోధుడు గుర్రం_జాషువా.


అంతవరకు రాజులని సంస్థానాధీశులని ఉన్నత వర్గాల ప్రజల జీవన విధానాలని భోగలాలసతని కవిత్వాలుగా మలిచి ఊడిగం చేస్తూ వెయ్యేళ్ళ తెలుగు సాహితి పదాన్ని నడుపుతూ పబ్బం గడుపుకునే కొందరు కుహనా కవులకి దిమ్మ తిరిగేలా తెలుగునాట దళితులని, అణచబడ్డ వర్గాల వారిని కథానాయకులు గా చిత్రీకరించి రాసిన ఘనత తెలుగునాట ఇద్దరికే దక్కుతుంది ఒకరు గబ్బిలం, పిరదౌసి లాంటి ఆణిముత్యాలకి ప్రాణం పోసిన గుర్రం జాషువా కాగా మరొకరు శంభుకవధ రాసిన కవిరాజు  త్రిపురనేని రామస్వామి చౌదరి.


గుంటూరు జిల్లా వినుకొండ లో 1895 లో ఒక దళిత కుటుంభం లో జన్మించిన గుర్రం జాషువా ఆధునిక కవిత కి ప్రాణం పోసిన ధీరుడు అని చెప్పడం లో అతియోశక్తి కాదు. ఆయన ఆధునిక భావాలని విమర్శించినా కొందరు ఛాందస వాదులని ఉద్దేశించి "గవ్వకు సాటిరాని పలుకాకుల మూకలు నన్నెవ్విధి దూరినా నను వరించిన శారదా లేచిపోవునే" అని అనడం ఆయన ధీరోదాత్తతకి అద్దం పడుతుంది.


ఒక దళితుడిని కథానాయకుడి గా మలిచి రాసిన "గబ్బిలం" కావ్యం లో అణచబడ్డ అట్టడుగు వర్గాల ప్రజల స్థితిగతుల్ని వర్ణిస్తూ "ముప్పది మూడు కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో భాగ్యవిహీనుల ఆర్తనాదాలు ఎవరికీ వినిపిస్తాయి ..! అణగారిన జాతిజనుల ఈతి బాధలు తీర్చు దేవుడెవ్వడు? " అంటూ రాసిన పదాలు మనల్ని ఆలోచింపచేస్తాయి.


వర్ణ వివక్షత ని ఎత్తి చూపుతూ 

"కులములేని నేను కొడుకుల బుట్టించి 

యీ యఖాతమందే త్రోయవలెనే

భార్యయేలా బుట్టుబానిసకని వాడు

జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష  "  రాసిన ఈ పద్యం మరో  ఆణిముత్యం 


అలాంటి కవి కోకిల 1971 జులై 24 నా స్వర్గస్థులయ్యారు. వారి "కొత్తలోకం" లో కవుల గురించి వర్ణిస్తూ


"రాజు మరణించే నొక తార రాలిపోయే

కవియు మరణించే నొక తార గగన మెక్కె

రాజు జీవించె రాతి విగ్రహములందు

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు"


ఆయన రాసిన పదాలని అక్షరాలా నిరూపించి ప్రజల నాల్కులయందు మరణం అనేది లేకుండా జీవిస్తున్న సుకవి, నవయుగ చక్రవర్తి, #విశ్వనరుడి వర్ధంతి సందర్బంగా నా ఈ అక్షర నివాళులు(సశేషం).


స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...