14, నవంబర్ 2020, శనివారం

పెమ్మసాని వారి చరిత్ర - 1

పెమ్మసాని నాయకులు "ముసునూళ్ల"  గోత్రీకులు. వీరిని గండికోట కమ్మవారి గా పిలుస్తారు. వీరి వృత్తాంతం విజయనగర సామ్రాజ్యం లో  ప్రౌఢ దేవరాయల కాలం నుండి మాత్రమే తెలియుచున్నది. వీరు మొదట సామాన్య గృహస్థులు గా ఉండేవారని తరువాత విజయ నగర సామ్రాజ్య నిర్మాతలు అయినా రాయల వారి  మన్నన చూరగొని వారికి దండనాయకులు గా, సైన్యాధిపతులు ఉండటమే గాక ప్రస్తుత  కడప జిల్లా జమ్మలమడుగు దగ్గర ఉన్న "గండికోట" ని రాజధాని గా చేసుకొని గండికోట సామంత రాజ్యాన్ని దాదాపు మూడు వందల ఏండ్లకి పైగా పాలించారని తెలుస్తుంది. 

పెమ్మసాని  వంశ పూర్వ నామం "ఆలం" వారని వారి వంశ మూలపురుషుడు మొదటి తిమ్మనాయుడు. పెమ్మసాని అనేది "పెమ్మయాసాహిణి" అనే పదానికి వికృత రూపం అని  సాహిణి అనగా గుర్రపు రౌతు లేదా వీరుడు అని అర్ధం. జన శృతుల్లో క్రమంగా పెమ్మయా సాహిణి కాస్త  పెమ్మసాని గా స్థిరపడినట్లు కొందరి  చరిత్ర కారుల అభిప్రాయం. 

క్రీ శ  1431 లో  సంగమ  రాయల  వంశం లో ప్రౌఢ దేవరాయలు పెమ్మసాని తిమ్మనాయుడ్ని గుర్తించి అతనికి "యాడకి" పరగణ పరిపాలన అధికారాన్ని ఇచ్చినట్లు ఆ తరువాత ప్రౌఢ దేవరాయలు నేతృత్వం లో అనేక యుద్ధములలో పాల్గొని తిమ్మనాయుడు శౌర్యం చూపినందుకు గాను మెచ్చి గండికోట పాలనా అధికారాన్ని కట్టబెట్టినట్లు  కైఫీయతు లలో ఉంది.  పెమ్మసాని తిమ్మనాయుడికి  ముందు గండికోట పాలకుడు గా ఉన్న జిల్లెల్ల చలపతి రాజు కట్టించిన కోటని మల్లి పునరుద్ధరించి కట్టించాడు. గండికోట లోనే గాక యాడికి, గుత్తి లలో కూడా మరో రెండు కోటలని కట్టించుకొని గుత్తి, గండికోట సీమలని పరిపాలిస్తూ వచ్చాడు. 

కాలానుగుణంగా పెమ్మసాని వారి రాజ్యం అభివృద్ధి చెందసాగింది. వీరి రాజ్యం లో  నెల్లూరు, గుంటూరు, అనంతపురం, కృష్ణ మండలాల్లో చాలాభాగం ఉందని వీరు ఆ కాలం లో రాయలుకి తొమ్మిది లక్షల రూపాయిలు కప్పంగా చెల్లిస్తూ ఉండేవారని వీరి రాజ్య ఆదాయం ఇరవై ఐదు లక్షలు రూపాయిలు అని వీరి కింద 25 వేల మంది కాల్బలం 15 వేల అశ్విక దళం, 40 వరకు గజములు ఉన్నాయని ఈ వంశీకులకి "ఆధివీర" అనే  బిరుదులు కలవని శ్రీ మున్నంగి లక్ష్మి నరసింహ శర్మ గారు రాసుకొచ్చారు.  ఈ పెమ్మసాని వారు సొంత రూకలు, మాడలు కూడా వేయించి చలామణి చేయించినట్లు కూడా చరిత్ర రికార్డు లలో ఉంది. ఈ నాణాలకి ఒక వైపు వారి కుల దైవం వీరభద్రుడు రెండవ వైపు వెంకట రమణ ప్రతిమలు ఉండేవని స్థానిక చరిత్రలు చెబుతున్నాయ్.  ఈ పెమ్మసాని వారు విజయనగర సామ్రాజ్యం లో ప్రసిద్ధి చెందిన పాలెగాండ్రు అని వారికి విజయనగర రాజ్యం లో ముఖ్య కార్యక్రమాల నిమిత్తం  సపరివారసమేతంగా విచ్చేసినప్పుడు బస చేయడానికి  స్వయంగా 1,240 కుంటల స్థలాలు  కలిగి ఉన్నారని " విజయనగర సామ్రాజ్యం" అనే  ప్రాచీన కడితి పుస్తకం లో ఉన్నది. 

పెమ్మసాని తిమ్మనాయుడు కాలం లో కోటలనే గాక గుళ్ళు గోపురాలు కూడా పునరుద్దించారు, అగ్రహారాలు కట్టించారు. 1454 లో కోడూరు అనే అగ్రహారం కట్టించి ఇచ్చినట్లు చాటువుల్లో తెలుస్తుంది. అలాగే యాడికి కోట కట్టించడానికి త్రవ్వుతుండగా వీరభద్ర,గణపతి విగ్రహాలు దొరికితే వారికీ దేవాలయాలు కట్టించాడని అలాగే ఆoజనేయ స్వామి దేవాలయం కూడా కట్టించినట్లు యాడికి కైఫీయతు లలో దొరికింది . 

"చాలు గుఱ్ఱాలు మౌళి గడి -సంగడి రాజులూ గొల్వ రండహో 

హాలాహాలోగ్రపాలదహ -నార్చుల యంతటి దాటి వాడు నా 

యేలిక వెంకటాద్రి ధర -నిశుని తిమ్మడు పెమ్మసాని భూ 

పాలుడు హెచ్చు ధాత్రి గల -పార్థివు లెల్లరు లొచ్చువారికిన్"

సంగమ వంశం లో మల్లిఖార్జున రాయలు తరువాత విరూపాక్ష, రెండవ ప్రౌఢ దేవరాయలు 1487 వరకు విజయనగర సామ్రాజ్యం ని పరిపాలించారు. ఆ తరువాత సాళువ నరసింహ రాయలు రాజ్యం ఆక్రమించి 1493 వరకు పాలించారు. గండికోట సామంతులు అయినా పెమ్మసాని వారు కూడా సంగమ వంశస్థుల నుండి సాళువ వంశస్థుల దగ్గర సామంతులు గా చేరారు. 








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...